Ayodhya Rama mandir: అయోధ్యలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం.. వీడియో వైరల్

అయోధ్య ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగవైభవంగా జరిగాయి. స్వామి దర్శనం కోసం దేశవిదేశాల నుంచి భక్తులు భారీగా పోటెత్తారు.

Ayodhya Rama mandir

Ayodhya Rama mandir: యూపీలోని అయోధ్య ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగవైభవంగా జరిగాయి. స్వామి దర్శనం కోసం దేశవిదేశాల నుంచి భక్తులు భారీగా పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. రామనవమి సందర్భంగా ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. అయోధ్య ఆలయంలో బాలరాముడి నుదిటిపై ‘సూర్య తిలకం’ చూసి భక్తులు పరవశించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట జరిగిన తరువాత వచ్చిన రెండో శ్రీరామ నవమి ఇది.

 

అయోధ్యలో మార్చి 29 నుంచి వసంత నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. శ్రీరామనవమి సందర్భంగా ఇవాళ మధ్యాహ్నం 12గంటలకు రాముల వారికి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా భానుడి సూర్యకిరణాలు బాలరాముడి నుదిటిపై తిలకం దిద్దాయి. సరిగ్గా నాలుగు నిమిషాల పాటు సూర్యకిరణాలు బాల రాముడి నుదిటిపై ప్రసరించాయి. ఈ అద్భుతాన్ని చూసి భక్తులందరూ తరించారు. అదే సమయంలో గర్భాలయంలో లైట్లు ఆర్పివేయడంతో సూర్య తిలకం దృశ్యాలు మరింత శోభాయమానంగా వెలుగొందాయి. శ్రీరామనవమి సందర్భంగా స్వామిని దర్శించుకునేందుకు అయోధ్యకు భక్తులు పోటెత్తారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక, డ్రోన్ల సాయంతో సరయూ నది జలాలను భక్తులపై జల్లారు.

 

‘‘అయోధ్య ఆలయంలో గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదిటిపై సూర్యకిరణాలు పడేందుకు మూడో అంతస్తులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పరిమిత సంఖ్యలో పైపులు, కుంభాకార, పుటాకార కటకాలతో ఒక వ్యవస్థను రూపొందించారు. ఆలయ శిఖర భాగంలో సూర్యక్రాంతి గ్రహించేందుకు ఒక పరికరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పైపులోపలికి కాంతి ప్రసరించి తిలకం వలే కన్పిస్తోంది. బెంగళూరులోని శాస్త్రవేత్తలు, పరిశోధకుల సాయంతో సీబీఆర్ఐ శాస్త్రవేత్తలు దీనిని నిర్మించారు.’’