Samatha Kumbh 2023: జై శ్రీమన్నారాయణ నామస్మరణతో హైదరాబాద్ శివారు ముచ్చింతల్‌లో సమతా క్షేత్రం పులకించింది. సమతా కుంభ్-2023 ఉత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ ఆధ్వర్యంలో 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. తొమ్మిదో రోజు నిత్య కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఉదయం 5 గంటల 45 నిమిషాలకు స్వామివారికి సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 6 గంటల నుంచి ఆరున్నర గంటల వరకు అష్టాక్షరీ మంత్ర జపం నిర్వహించారు. ఉదయం ఆరున్నర గంటల నుంచి ఏడు గంటల వరకు ఆరాధన.. సేవాకాలం కొనసాగింది. అనంతరం శాత్తుముఱై.. తీర్థప్రసాద గోష్టి నిర్వహించారు.
తొమ్మిదో రోజు విశేష ఉత్సావాల్లో భాగంగా ఉదయం 10 గంటలకు ప్రత్యేక వేదికపై సామూహిక ఉపనయనాలు నిర్వహించారు. ఆ తర్వాత నిత్య పూర్ణాహుతి, బలిహరణ కార్యక్రమాలు జరిపించారు. మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి భక్తులను ఉద్దేశించి ఉపదేశిస్తూ సమాజంలో రోజురోజుకీ కులమతాలు.. వర్ణాలు.. ఆస్తులు.. పార్టీల పేరుతో అడ్డుగోడలు తయారయ్యాయన్నారు. ఈ అడ్డుగోడలు ఉక్కుగోడలుగా మారుతున్నాయని.. ఇప్పటికి ఇది బాగానే ఉన్నట్టు అనిపించింనా.. దాని పర్యవసనాలు దారుణంగా ఉంటాయన్నారు స్వామి.
Samatha Kumbh 2023: సమతా కుంభ్ లో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక పరిమళాలు
సాయంత్రం 5 గంటల నుంచి 5 గంటల 45 నిమిషాల వరకు శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణం చేశారు. 6 గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు సాకేత రామచంద్ర ప్రభువుకు గజవాహన సేవ వైభవంగా నిర్వహించారు. అనంతరం 18 దివ్యదేశాధీశులకు 18 గరుడ సేవలు నిర్వహించారు. రాత్రి ఎనిమిదిన్నరకు నిత్యపూర్ణాహుతి జరిగింది. రాత్రి 9 గంటలకు తిరువీధి సేవ, మంగళాశాసనం, తీర్థ, ప్రసాద గోష్టి జరిపారు.