Tiruchanur Brahmotsavam 2021 : శ్రీ‌వారి ఆల‌యం నుండి శ్రీ పద్మావతి అమ్మవారికి సారె

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధవారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారె స‌మ‌ర్పించారు.

Tiruchanur Brahmotsavam 2021 :  తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధవారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారె స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా 825 గ్రాములు బ‌రువుగ‌ల కెంపులు,పచ్చలు, నీలము, ముత్యాలు పొదిగిన బంగారు పతకము, రెండు బాజీ బందులు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి కానుక‌గా స‌మ‌ర్పించారు.

ప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి సారె తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీ‌వారి ఆల‌యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి పాల్గొన్నారు.

ముందుగా శ్రీవారి ఆలయంలో తెల్లావారుఝూమున గం.2.30 నుండి పరిమళాన్ని(నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన మిశ్రమం) విమాన ప్రాకారంలో ఊరేగింపు చేప‌ట్టారు.

Also Read : Governor Tamilisai Soundararajan : నల్గొండ జిల్లాలో నేడు గవర్నర్ తమిళ్‌సై పర్యటన

అనంత‌రం శ్రీవారి వక్ష:స్థల లక్ష్మీ అమ్మవారికి ఏకాంతంగా తిరుమంజనం నిర్వ‌హించారు. ఆ త‌రువాత తెల్లవారుఝామున గం.4.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణంతో కూడిన సారె ఊరేగింపు మొదలైంది. ఈ సారెను గజాలపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా ఊరేగించి అనంతరం కాలినడకన తిరుమల నుంచి తిరుపతిలోని అలిపిరి వద్దకు తీసుకెళ్లారు.

అక్క‌డినుండి కోమ‌ల‌మ్మ స‌త్రం, తిరుచానూరు పసుపు మండపం మీదుగా ఆలయం వ‌ద్ద అమ్మ‌వారికి సారె స‌మ‌ర్పించారు. ఆభ‌ర‌ణంతో కూడిన శ్రీ‌వారి సారెను అలిపిరి వ‌ద్ద అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తిరుప‌తి జెఈవో శ్రీ వీరబ్రహ్మంకు అంద‌జేశారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వ‌ద్ద ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డికి జెఈవో అందించారు.

ట్రెండింగ్ వార్తలు