Kondagattu Temple : ఆలయాల అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ధూప, దీప నైవేద్యాలకు ఏ మాత్రం లోటు లేకుండా చూసుకుంటున్న బీఆర్ఎస్ సర్కార్.. ఇప్పుడు ఆలయాలకు వైభవాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా యాదాద్రి తరహాలోన కొండగట్టు అంజన్న ఆలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.100 కోట్ల నిధులను మంజూరు చేసింది. కొండగట్టుకి నిధులు కేటాయించిన తర్వాతే ఆలయంలో అడుగు పెడతానన్న సీఎం కేసీఆర్.. ఇచ్చిన మాట నిలబెట్టుకోనున్నారు. ప్రముఖ ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి ఆధ్వర్యంలో కొండగట్టు కొత్త రూపు దిద్దుకోనుంది.
Also Read..Samatha Kumbh 2023: సమతా కుంభ్ లో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక పరిమళాలు
జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటలో ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం చాలా ప్రాచీనమైన గుడి. ఇక్కడ వెలసిన ఆంజనేయ స్వామిని మహిమాన్వితుడిగా భక్తులు కొలుస్తుంటారు. నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటుగా మహారాష్ట్ర, మధ్యప్రదే శ్, ఉత్తరప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తారు.
ప్రతి మంగళవారం, శనివారం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. గుట్టల మధ్య కొలువైన ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చే వారు భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. కోరిన కోర్కెలు తీర్చే అంజన్నను చాలా మంది తమ ఇలవేల్పుగా భావిస్తారు. కానీ, ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చే భక్తులు అరకొర వసతులతో ఇబ్బంది పడుతున్నారు. సమస్యలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆలయ అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది. ఆంజనేయ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలంటూ సీఎం కేసీఆర్ కు ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
గతేడాది డిసెంబర్ 7న జగిత్యాల బహిరంగ సభలో ప్రకటించిన విధంగా గుడి అభివృద్ధి కోసం రూ.100 కోట్లు కేటాయించారు. ఆలయ అభివృద్ధి కోసం 20ఏళ్ల క్రితమే మాస్టర్ ప్లాన్ రూపొందించినా అమలు కాలేదు. దానికి ఇప్పుడు మోక్షం లభించింది.
ఈ ఆలయం 400ఏళ్ల క్రితం నిర్మాణం జరిగింది. ఆవరణలో దాదాపు 200 గదులు, గుడి చుట్టూ విశాలమైన మాడ వీధుల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. అంజన్న ఆలయానికి 45 ఎకరాల భూమి ఉండగా అందులో ఆలయ పరిసరాలే 22 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. ఈ క్షేత్రం పక్కనే ఉన్న 333 ఎకరాల ప్రభుత్వ భూమిని నాలుగేళ్ల క్రితమే జిల్లా కలెక్టర్ ఆలయానికి స్వాధీనం చేశారు. తాజాగా ప్రభుత్వం 100 కోట్ల నిధులు కేటాయించడంతో ఆలయ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. ప్రముఖ ఆర్కిటెక్ట్, యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణ డిజైనర్ ఆనంద సాయి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని పరిశీలించి నిర్మాణ నమూనాలను ప్రభుత్వానికి అందించబోతున్నారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 14న అంజన్న ఆలయానికి రానున్నారు. దర్శనం తర్వాత ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. విస్తరణ ప్రణాళికలపై సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేస్తారు. మొత్తం మీద కొండగట్టు అంజన్న ఆలయం కొత్త రూపు దిద్దుకోబోతుండటంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.