Mahalaya Amavasya 2021 : మహాలయ అమావాస్య విశిష్టత

ఏడాది పొడవునా వచ్చే అమావాస్యలలో రెండు అమావాస్యలకు ప్రత్యేకత ఉంది ఒకటి మహాలయ అమావాస్య , రెండోది దీపావళి అమావాస్య.

Mahalaya Amavasya 2021 :  ఏడాది పొడవునా వచ్చే అమావాస్యలలో రెండు అమావాస్యలకు ప్రత్యేకత ఉంది ఒకటి మహాలయ అమావాస్య , రెండోది దీపావళి అమావాస్య. భాద్రపద మాసంలో వచ్చే అమావాస్య, రెండోవది ఆశ్వయుజ మాసం అమావాస్యలు చెప్పుకోదగినవి. భాద్రపద అమావాస్యను ‘‘మహాలయ అమావాస్య’’ అని, ఆశ్వయుజ అమావాస్యని, దీపావళి అమావాస్య అని పిలుస్తారు. ఈ రెండు అమావాస్యలు పితృదేవతలకు సంబంధించినవి.

‘‘ఆషాఢీ మవధిం కృత్వా పంచమం పక్షమ్మాతాః కాంక్షంతి పితరః క్లిష్టా అన్నమప్యన్వహం జలమ్’’  ఆషాడ పూర్ణిమ మొదలు అయిదవ పక్షమును అనగా ఆషాఢ కృష్ణపక్షం, శ్రావణ రెండు పక్షములు, భాద్రపద శుక్లపక్షం, వెరశి నాలుగు పక్షములు (పక్షం అంటే పదిహేను రోజులు) గడిచిన తరువాత వచ్చేది, అయిదవ పక్షం, అదే భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు మహాలయ పక్షము’’లంటారు. చివరగా వచ్చే అమావాస్యను ‘మహాలయ అమావాస్య’ అంటారు. ఈ ఏడాదిమహాలయ అమావాస్య అక్టోబర్ 6వ తేదీ బుధవారం నాడు వచ్చింది. ఈ మహాలయ పక్షం రేపటితో ముగుస్తుంది.  అమావాస్య2021వ సంవత్సరం లో   అక్టోబర్ 5 మంగళవారం రాత్రి 7 గంటల తర్వాత నుంచి వచ్చింది కనుక బుధవారం నాడే పితృతర్పణాలు వదలాలి.

ఈ పక్షములో పితరులు అహారాన్ని, ప్రతిరోజూ జలమును కోరుతారు. తండ్రి చనిపోయిన రోజున, మహాలయ పక్షములలో పితృ తర్పణములు, యధావిధిగా శ్రాద్ధవిధులు నిర్వర్తిస్తే,  పితృదేవతలంతా సంవత్సరమంతా తృప్తి చెందుతారు. తమ వంశాభివృద్ధిని గావిస్తారు.వారు ఉత్తమ గతిని పొందుతారు. ఈ విషయాలన్నీ నిర్ణయ  సింధు, నిర్ణయ దీపికా గ్రంథములు పేర్కొన్నాయి.

భాద్రపద  మాసంలో శుక్లపక్షం దేవపదము, కృష్ణపక్షం పితృపదము, అదే మహాలయ పక్షము. మహాలయమంటే …మహాన్ అలయః, మహాన్‌లయః మహల్ అలం యాతీతివా అనగా పితృదేవతలకిది గొప్ప ఆలయము, పితృదేవతల యందు మనస్సు లీనమగుట, పుత్రులిచ్చు తర్పణాదులకు పితృదేవతలు తృప్తిని పొందుట అని అర్థములు.

అమావాస్య అంతరార్థం: ‘అమా’ అంటే ‘‘దానితోపాటు’’, ‘వాస్య’ అంటే వహించటం. చంద్రుడు, సూర్యుడిలో చేరి, సూర్యుడితోపాటు వసించే రోజు కాబట్టి ‘అమావాస్య’ అన్నారు.
సూర్యుడు – స్వయం చైతన్యం. చంద్రుడు జీవుడే. మనస్సుకు అధిపతి. అదే చంద్రుని ఉపాధి. మనస్సు పరమ చైతన్యంలో లయమైతే, జీవుడికి జీవభావం పోయి దైవభావం
సిద్ధిస్తుంది. అదే నిజమైన అమావాస్య.

చంద్రమండలం ఉపరితలం మీద నివసించే పితృదేవతలకు, అమావాస్య తిధి మిట్టమధ్యాహ్నమవుతుంది. అందుకే భాద్రపద అమావాస్య రోజున, దీపావళి అమావాస్య రోజున
పితృదేవతలు పుత్రులిచ్చే తర్పణములకు ఎదురు చూస్తూ ఉంటారని ధర్మగ్రంథాలు తెలుపుతున్నాయి.

మత్స్యపురాణగాథ: పితృదేవతలు ఏడు గణములుగా ఉన్నారు. వారి మానవ పుత్రిక ‘‘అచ్ఛోద’’. పితృదేవతలు ఒక సరస్సును సృష్టించారు. ఆ సరస్సుకు పుత్రిక పేరు పెట్టారు. ఆ
అచ్ఛోద, సరస్సు తీరంలో తపస్సు చేసింది. పితృదేవతలు సంతుష్టులై ప్రత్యక్షమయ్యారు. వరము కోరుకోమన్నారు. ఆమె వారిలో ‘‘మావసు’’ డను పితరుని కామ పరవశంతో
వరునిగా కోరింది. యోగభష్ట్రురాలయింది. దేవత్వంపోయి, భూమి మీద కొచ్చింది. మావసుడు, అచ్చోదను కామించలేదు. కనుక అచ్ఛోద ‘‘మావస్య’’ అనగా ప్రియురాలు
అధీనురాలు కాలేకపోయింది. కనుక. ‘‘మావస్య’’ కాని ఆమె ‘‘అమావస్య’’ లేక ‘‘అమావాస్య’’ అయింది.

తన తపస్సుచే పితరులను తృప్తినొందించిన అమావాస్య అనగా అచ్ఛోద, పితరులకు ప్రీతిపాత్రమయింది. అందువలన, పితృదేవతలకు అమావాస్య (అచ్ఛోద) తిథి యందు
పితురులకు అర్పించిన తర్పణాది క్రియలు, అనంత ఫలప్రదము, ముఖ్యంగా సంతానమునకు క్షేమము, అభివృద్ధికరము. తప్పును తెలిసికొన్న అచ్ఛోది మరల తపోదీక్ష వహించింది.

జననీ జనకులకు ప్రేమానురాగాలను అందించి, మరణానంతరం కూడా వారికోసం యథావిధిగా నైమిత్తిక కర్మల నాచరించి, పితృతర్పణాదులనిస్తే, వారి ఋణం తీర్చుకున్న
వాళ్లవుతారని, పితరుల ఆశీస్సులతో వంశాభివృద్ధి జరుగుతుందని చెప్తోంది మహాలయ అమావాస్య. చనిపోయినవారందరి స్మృతికోసం చేసే ఈ అమావాస్యను సర్వ పితృ అమావాస్య అని కూడా అంటారు. చనిపోయిన తమ పెద్దల జ్ఞాపకార్ధం ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ వర్గం వారైనా పాటించే కార్యక్రమం ఇది.

ప్రపంచ వ్యాప్తంగా అందరికీ ఈ పితృ స్మరణ రోజు ప్రత్యేకంగావున్నది.ఏ జాతి వారైనా, ఏ కులం వారైనా, వాళ్ళెక్కడవున్నా, వారి వారి సంప్రదాయాన్నిబట్టి, ఇంటి ఆచారాల్నిబట్టి, వాళ్ల వాళ్ల అనుకూలతనుబట్టి పితృ దేవతలను సంస్మరించుకునే రోజు ఇది. ఈ రోజు తెలిసిన, తెలియని బంధువులకు శ్రాద్ధం పెట్టడానికి ఒక నిర్ధిష్టమైన రోజు. పితృ పక్షంలో తమ చనిపోయిన వారి తిథిని మరచిపోయిన వారికి అమావాస్య అనువైన రోజు. ఈ రోజు చనిపోయిన వారికి శ్రాద్ధం నిర్వహిస్తే.. వారి ఆత్మ లకు మోక్షం దక్కుతుందని నమ్మకం. దీంతో వారు వారి కుటుంబాలకు దీవెనలు అందిస్తారని అంటారు.

ట్రెండింగ్ వార్తలు