తిరుమల బ్రహ్మోత్సవాలు : సోమవారం సాయంత్రం ధ్వజారోహణం

  • Publish Date - September 30, 2019 / 02:37 AM IST

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యే తొలిరోజున జరిగే ఉత్సవం ‘ధ్వజారోహణం’. ఆరోజు ఉదయం స్వామివారికి సుప్రభాత, తోమాల సేవలు జరిగాక శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామికి ఏకాంతంగా తిరుమంజన ప్రక్రియ చేసి, నైవేద్యం సమర్పిస్తారు. ఆలయ సన్నిధిలోని ధ్వజస్తంభం మీద పతాకావిష్కరణ చేస్తారు. 2019, సెప్టెంబర్ 30, సోమవారం సాయంత్రం  గం.5-23 నిమిషాల నుంచి 6 గంటల  మధ్య  మీన లగ్న సుమూహూర్తంలో ధ్వజారోహణ ఉత్సవం నిర్వహిస్తారు. 

“న భూతో న భవిష్యతి” అనేలా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు సకల దేవతామూర్తులనూ ఆహ్వానిస్తారు. స్వామి వాహనం గరుడుడు కాబట్టి, కొత్తవస్త్రం మీద గరుడుని బొమ్మ చిత్రీకరిస్తారు. దీన్ని ‘గరుడ ధ్వజ పటం’ అంటారు. దీన్ని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన కొడితాడును సిద్ధం చేస్తారు. గరుడధ్వజపటాన్ని ఊరేగించి, ధ్వజస్తంభం వద్దకు తెచ్చి, ఉత్సవ మూర్తులైన భోగ శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవిల సమక్షంలో గోధూళి లగ్నమైన మీనలగ్నంలో కొడితాడుకు కట్టి, పైకి ఎగురవేస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలు, అష్ట దిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వ గణాలకు ఆహ్వాన పత్రం.  

ఈ ఆహ్వానం అంది విచ్చేసిన దేవ, రాక్షసగణాలకు, వారివారి నిర్ణీత స్థలాలను కేటాయించి, పద్ధతి ప్రకారం, వారి నియమాల ప్రకారం నైవేద్యం రూపంలో బలిని సమర్పిస్తారు. దీంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఆరంభమైనట్లే. ఈ ఆహ్వానంతో ముక్కోటి దేవతలూ బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులూ కొండమీదే ఉండి, ఉత్సవాలను తిలకించి ఆనందిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఇలాంటి అరుదైన వేడుక సోమవారం సాయంత్రం నిర్వహిస్తారు.