Akhanda Hari Nama Sankeerthana
Tirumala : హిందూ ధర్మప్రచారంలో భాగంగా జానపద కళలను పరిరక్షించి అవి అంతరించిపోకుండా కాపాడేందుకు టిటిడి కృషి చేస్తోంది. ఇందులో భాగంగా కరోనా కారణంగా తిరుమలలో గత కొంత కాలంగా నిలిచిపోయిన అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమాన్ని ఆగస్టు 1వ తేదీ నుండి తిరిగి ప్రారంభించనుంది. వివిధ ప్రాంతాల నుండి జానపద కళాకారులు తిరుమలకు విచ్చేసి అన్నమయ్య, త్యాగయ్య తదితర వాగ్గేయకారుల భజనలు, కీర్తనలు ఆలపిస్తారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనే భజన బృందాల సభ్యులకు వసతి, భోజనం, దర్శనం కల్పిస్తారు. రాను పోను బస్సు ఛార్జీలకు అయ్యే రుసుమును వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు. భజన బృందాల సభ్యులకు నిర్దేశిత స్లాట్ కేటాయించి వారి వివరాలను టిటిడి వెబ్‌సైట్ www.tirumala.org లో అందుబాటులో ఉంచుతారు.
ఆగస్టు నెలకు సంబంధించి కేటాయించిన స్లాట్ల వివరాలను ఇప్పటికే వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. తిరుమలతో పాటు వివిధ జిల్లాల్లోని టిటిడి ఆలయాల్లో జరిగే ఉత్సవాల్లో ప్రదర్శనకు భజన బృందాల సభ్యులకు అవకాశం కల్పిస్తారు.