Vinayaka Chavithi 2025
Vinayaka Chavithi 2025 : వినాయక చవితి పర్వదినం వచ్చేసింది. ఈనెల 27 నుంచి గణేశ్ చతుర్థి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో గణేశ్ చతుర్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. వాడవాడల వినాయక మండపాలు ఏర్పాటు చేసి.. అందులో వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గణేశ్ నవరాత్రుల్లో భాగంగా తొమ్మిది రోజులు వినాయకుడిని పూజించి 10వ రోజు నిమజ్జనం చేస్తారు. ఈ పదిరోజులు వినాయక నామస్మరణతో తెలుగు రాష్ట్రాల్లోని పట్టణాలు, పల్లెలు మారుమోగిపోనున్నాయి.
వినాయకుడిని భక్తితో పూజిస్తే తలపెట్టిన ఏ కార్యంలో అయినా ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా విజయం సాధిస్తారని నమ్మకం. అందుకే గణేశ్ చతుర్థి పండుగ రోజు విఘ్నహర్త అయిన వినాయకుడికి పూజలు ఘనంగా చేస్తారు. ప్రతిఏడాది భాద్రపద మాసంలో వినాయక చవితి పండుగ వస్తుంది. ఈ సంవత్సరం గణేశ్ చతుర్థి పండుగ ఆగస్టు 27వ తేదీన వచ్చింది. ఆ రోజు నుంచి గణేశ్ ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
విఘ్నాలను తొలగించి శుభాలను ప్రసాదించే స్వామి వినాయకుడు. అందుకే గణనాథుడ్ని దేవతలుసైతం ఆరాధిస్తారు. అయితే, గణేశుడి ఆలయాల్లో ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులోని శ్రీలక్ష్మీ గణపతి దేవాలయం ఒకటి. ఇక్కడ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. సుమారు 1100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ప్రాచీన ఆలయంలో శ్రీలక్ష్మి గణపతి స్వామి ఏకశిలా మూర్తిగా భక్తులను కనువిందు చేస్తారు. పురావస్తు శాఖ అంచనా ప్రకారం.. ఈ ఆలయంలోని విగ్రహం తూర్పు చాళుక్యుల కాలం నాటిదిగా భావిస్తారు.
అలనాటి కాలంలో రాజులు ఇక్కడ ప్రత్యేక పూజలు చేసిన తరువాత ఏ పనులు ప్రారంభించినా అవి సకాలంలో పూర్తయ్యేవట. ఈ దేవాలయంలో భక్తులు తమ కోరికలను స్వయంగా స్వామి చెవిలోనే చెప్పుకుంటారు. ఆ కోరిన కోరికలు నెరవేరిన తరువాత పున: దర్శనానికి వచ్చి మొక్కలు చెల్లించుకుంటారు.
తూర్పుగోదావరి జిల్లాలోని ఈ శ్రీలక్ష్మి గణపతి దేవాలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆలయంలో 10 అడుగుల ఎత్తు, ఆరు అడుగుల వెడల్పుతో ఉన్న గణనాథుడి తొండం కుడివైపునకు తిరిగి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ కొలువుదీరిన గణనాథుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనికితోడు ఈ ఆలయంలోని వినాయకుడికి చెవిలో కోరికలు చెబితే కచ్చితంగా నెరవేరుస్తారని భక్తుల నమ్మకం. అందుకే ఈ ఆలయానికి భక్తులు దూర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చి ముడుపులు కడతారు. ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య ప్రతీయేటా పెరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు.. ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.
Also Read : Youtuber Swept Away: ఓ మై గాడ్.. వీడియో తీస్తుండగా ఊహించని ఘోరం.. కళ్ల ముందే కొట్టుకుపోయిన యూట్యూబర్..