మ్యాచ్ ప్రివ్యూ: నిర్ణయాత్మక వన్డేలో మార్పులు చేయనున్న భారత్, ఆసీస్‌లు

ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ను గెలుచుకున్న జట్టుగా రికార్డు సృష్టించిన కోహ్లీ సేన.. ఇప్పుడు మరో రికార్డు సాధించేందుకు తహతహలాడుతోంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా చివరి వన్డేలో గెలిచి కొత్త అధ్యాయాన్ని లిఖించేందుకు సిద్ధమవుతోంది టీమిండియా. అదేంటంటే భారత్ గతంలో ఎన్నడూ ఆస్ట్రేలియా గడ్డపై ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను గెలుచుకోలేదు. అయితే రెండు సందర్భాల్లో ఆసీస్‌లో వన్డే సిరీస్‌లు సాధించినప్పటికీ, అవి ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లు కాకపోవడం గమనార్హం. వాటిలో ఒకటి 1985లో జరిగిన వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌ ఆఫ్‌ క్రికెట్‌ టైటిల్‌ కాగా, రెండోది మూడు దేశాలు పాల్గొన్న సీబీ సిరీస్‌.  

తొలిసారి ఆసీస్‌ను ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో వారి గడ్డపైనే ఓడించే అవకాశం భారత్ చేతిలో ఉంది. మ్యాచ్ గెలిచి సిరీస్‌ను చేజిక్కించుకోవాలన్న తపనతో కోహ్లీసేన గురువారం వరకూ తీవ్రంగా శ్రమించింది. శుక్రవారం మెల్‌బౌర్న్‌ వేదికగా ఇరు జట్ల మధ్య సిరీస్‌ నిర్ణయాత్మక వన్డే జరుగనుంది. భారత్‌-ఆసీస్‌లు తలో వన్డే గెలిచి సమంగా నిలవడంతో మూడో వన్డే నిర్ణయాత్మకంగా మారింది. తొలి వన్డేలో ఆసీస్‌ 34 పరుగుల తేడాతో గెలవగా, రెండో  వన్డేలో 6 వికెట్ల తేడాతో భారత్‌ విజయం సాధించి సిరీస్ ఫలితాన్ని సమం చేసింది. 

 

టీమిండియాలో మార్పులు:
అరంగ్రేట మ్యాచ్ తోనే నిరాశపరిచాడు హైదరాబాద్ ఫేసర్ మొహ్మద్‌ సిరాజ్‌. అడిలైడ్‌ వేదికగా ఆసీస్‌తో రెండో వన్డేలో 10 ఓవర్లలో 76 పరుగులిచ్చి కనీసం ఒక్క వికెట్‌ కూడా తీయకుండా నిరుత్సాహానికి గురిచేశాడు. ఈ పేలవ ప్రదర్శనకు సిరాజ్‌పై వేటు తప్పేలా కనిపించడం లేదు. సిరాజ్ స్థానంలో రెండో వన్డేలో బెంచ్‌కే పరిమితమైన ఖలీల్‌ అహ్మద్‌ తిరిగి జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. మరో పక్క కేదర్ జాదవ్‌‌ను తీసుకోవడంపైనా అనుమానాలు నెలకొన్నాయి. జాదవ్‌ను తీసుకోవాలంటే జడేజా, కుల్దీప్‌‌లను తప్పించాల్సి ఉంటుంది. టీమిండియా మేనేజ్‌మెంట్ అటువంటి సాహసం చేయకపోవచ్చు. అడిలైడ్‌ వన్డేలో కుల్దీప్‌ రాణించనప్పటికీ మెల్‌బోర్న్‌ పిచ్‌ పొడిగా ఉండే అవకాశం ఉండటంతో అతనికే తుది జట్టులో అవకాశం ఖాయంగా కనబడుతోంది. 

2 మార్పులతో ఆస్ట్రేలియా:
నిర్ణయాత్మక వన్డే కావడంతో ఆసీస్ జట్టు అదే తరహాలో సిద్ధమైంది. టెస్టు ఫార్మాట్‌లో రాణించిన లయన్ వన్డేలలో నిరుత్సాహపరుస్తుండటంతో అతని స్థానంలో ఆడమ్‌ జంపాను తీసుకోనుంది. మరో కీలక మార్పుగా పేసర్‌ బెహ్రెన్‌డార్ఫ్‌ స్థానంలో బిల్లీ స్టాన్‌లేక్, రిజర్వ్‌ ఆటగాడిగా కేన్‌ రిచర్డ్‌సన్‌ను జట్టులోకి తీసుకున్నారు. భారత కాలమాన ప‍్రకారం ఉదయం గం.7.50 ని.లకే మ్యాచ్‌ ఆరంభం కానుంది. మూడు టీ20ల సిరీస్‌ 1-1తో సమం కాగా, నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-1తో టీమిండియా గెలుచుకుంది. 

 

పిచ్ వాతావరణం:

ఎంసీజీ పిచ్‌పై ఫాస్ట్‌బౌలర్లకు మంచి బౌన్స్‌ లభించనుంది. బౌండరీలు దూరంగా ఉన్నందున స్పిన్నర్లు కూడా కీలకం కానున్నారు. వాతావరణం ఆటకు అనుకూలంగా ఉండటంతో ఇరుజట్ల మధ్య మంచి పోటీ నెలకొననుంది.