టాప్ లేపింది: టీ20 చరిత్ర తిరగరాసిన అఫ్గాన్ క్రికెట్

నిన్నకాక మొన్నొచ్చి.. నిన్నకాక మొన్నొచ్చి.. అని ఓ సినిమాలో విలన్‌ అంటుంటే.. ఎప్పుడు వచ్చామని కాదయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా.. అని దిమ్మతిరిగే పంచ్ విసురుతాడు. అదే తరహాలో పసికూన అఫ్ఘనిస్తాన్ కొద్ది రోజుల ముందే ఫామ్ అందుకుంటోంది అనుకుంటున్నారంతా. అలా ఉండగానే రికార్డుల వరద పారించేందుకు సిద్ధమైపోయింది. 

ఇక ఆ జట్టు ప్లేయర్ల వ్యక్తిగత ప్రదర్శన కూడా జట్టును టాప్‌లో ఉంచుతోంది. ఫిబ్రవరి 23 శనివారం అఫ్ఘన్ జట్టు ఐర్లాండ్‌తో పోరాడి గెలిచింది. ఐర్లాండ్‌ జట్టుపై విరుచుకుపడిన హజరత్ జజైస్ తానొక్కడే 162 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మొత్తం జట్టు చేసిన పరుగులు 278 కావడం విశేషం. ఇప్పటి వరకూ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఏ జట్టు ఇంతటి అత్యధిక స్కోరు నమోదు చేయలేకపోయింది. 

ప్రతి మ్యాచ్‌లోనూ వికెట్ల పతనాన్ని శాసించే రషీద్ ఖాన్ అదే తరహాలో రాణించాడు. కేవలం 25 పరుగులు మాత్రమే ఇచ్చి 4వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత చేధనకు దిగిన ఐర్లాండ్ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్లు నష్టపోయి 194పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్‌తో అఫ్గన్ క్రికెట్ ఖాతాలో మరిన్ని రికార్డులు వచ్చి చేరాయి. 

అత్యధిక జట్టు స్కోరు – 278/3
అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన వికెట్లు – 236(జజజ్, ఘని)
ఒకే జట్టు నుంచి అత్యధిక సిక్సులు – 22
ఒకే ప్లేయర్ నుంచి అత్యధిక సిక్సులు – 16 (జజయ్)
రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు-జజయ్ – (162)

ఇన్ని రికార్డులు సాధించిన అఫ్ఘనిస్తాన్ జట్టును ట్విట్టర్ వేదికగా ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు క్రికెట్ అభిమానులు. ఇప్పటివరకూ ఉత్తమ బౌలర్లుగా పేరు తెచ్చుకుంటున్న అఫ్ఘాన్ జట్టు బ్యాటింగ్ లోనూ సత్తా చాటడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.