Ajaz Patel: భారత్‌లో పుట్టి భారత్‌పైనే అత్యుత్తమ రికార్డు.. 10వికెట్లు తీసిన కివీస్ బౌలర్
ముంబై టెస్టులో టీమిండియా బ్యాట్స్‌మెన్‌లను ముప్పుతిప్పలు పెట్టి, పదికి పది వికెట్లు పడగొట్టాడు అజాజ్ పటేల్.

Azaz Patel
Ajaz Patel: ముంబై టెస్టులో టీమిండియా బ్యాట్స్‌మెన్‌లను ముప్పుతిప్పలు పెట్టి, పదికి పది వికెట్లు పడగొట్టాడు అజాజ్ పటేల్. భారత్‌లో పుట్టి భారత్‌పైనే రికార్డు క్రియేట్ చేశాడు అజాజ్ పటేల్. కివీస్ బౌలర్ అజాజ్ పటేల్ టెస్ట్ క్రికెట్‌లో అరుదైన ఘనతను అందుకున్నాడు. భారత్‌లో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు.
ముంబై వాఖండే వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో పది మంది భారత ఆటగాళ్లను పెవిలియన్ పంపించింది అజాజ్.. ఒక టెస్ట్ ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన మూడవ బౌలర్‌గా అజాజ్ నిలిచాడు. ఈ రికార్డు క్రియేట్ చేసిన ముగ్గురూ స్పిన్నర్లే.. అంతకుముందు ఇంగ్లండ్‌కు చెందిన జిమ్ లేకర్, భారత ఆటగాడు అనిల్ కుంబ్లే పేరిట ఈ రికార్డు ఉంది.
ఓవర్‌నైట్ స్కోరు 221/4 వద్ద రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు, 325 పరుగులకి ఆలౌట్ అయ్యింది. రెండో రోజు ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే వరుస బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టి టీమిండియాకి షాక్ ఇచ్చాడు అజాజ్ పటేల్. అయితే మయాంక్ అగర్వాల్, అక్షర్ పటేల్ కుదురుకోవడంతో 300+ స్కోరు చేసింది భారత జట్టు.
1956లో మాంచెస్టర్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్పిన్నర్ జిమ్ లేకర్ 10 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ జట్టుపై ఇంతటి రికార్టు సాధించి ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా నిలిచాడు. దీని తర్వాత, భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 1999 సంవత్సరంలో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఒక ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసి రెండో బౌలర్‌గా నిలిచాడు.
దాదాపు 22ఏళ్ల తర్వాత ఇప్పుడు ముంబైలోని వాంఖడే వేదికగా న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ 10 వికెట్లు పడగొట్టాడు. జిమ్ లేకర్ 53 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టగా, కుంబ్లే 74 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు భారత్‌పై 119 పరుగులు ఇచ్చి అజాజ్ 10 వికెట్లు పడగొట్టాడు.