హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)తో వివాదం నెలకొన్న నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ రాష్ట్రానికి రావాలని సన్‌రైజర్స్‌ను కోరింది. ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లను విశాఖ వేదికగా నిర్వహించాలని ప్రతిపాదించింది. అంతేకాదండోయ్ పన్ను మినహాయింపులు కూడా ఇస్తామని, ఇతర సహాయసహకారాలను అందిస్తామని సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్‌కు తెలిపింది.
ప్రస్తుతం సన్‌రైజర్స్ జట్టు సమాధానం కోసం వేచి చూస్తున్నట్లు ఏసీఏ ప్రెసిడెంట్, విజయవాడ ఎంపీ చిన్ని తెలిపారు. ఢిల్లీ మాదిరిగానే రెండు మ్యాచ్ లు ఇక్కడ నిర్వహించాలని కోరామన్నారు. ఈ నెల 12న హనుమాన్ జయంతి ఉంది. ఆ రోజు కూడా మ్యాచ్ ను నిర్వహించడానికి సిద్దంగా ఉన్నామన్నారు.
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఫ్రీ పాసుల విషయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు హెచ్‌సీఏకు మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు పాసుల విషయంలో తమను వేధిస్తున్నాడని, బెదిరింపులకు పాల్పడుతున్నాడని సన్‌రైజర్స్ మేనేజర్ శ్రీనాథ్.. హెచ్‌సీఏ సెక్రటరీ శ్రీనివాస్‌కు మెయిల్ చేయడం కలకలం రేపింది.
ఈ వ్యవహరంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. సీఎం జోక్యంతో సన్‌రైజర్స్ హైదరాబాద్, హెచ్‌సీఏ అధికారుల మధ్య జరిగిన చర్చలు ఫలప్రదం అయ్యాయి.
ఒప్పందం మేరకు 10 శాతం టికెట్లను ఇచ్చేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ అంగీకరించింది. గొడవ సద్దుమణిగిందని, పాసుల విషయంలో ఏకాభిప్రాయం వచ్చిందని హెచ్‌సీఏ-సన్‌రైజర్స్ హైదరాబాద్‌లు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి.