Shubman Gill : బెంగళూరు పై విజయం తరువాత.. కోహ్లీకి కౌంటర్ ఇస్తున్నట్లు గుజరాత్ కెప్టెన్ గిల్ పోస్ట్..!
బెంగళూరు పై విజయం తరువాత గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025లో భాగంగా బుధవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో గుజరాత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన తరువాత గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
దీనిపై కోహ్లీ ఫ్యాన్స్‌తో పాటు ఆర్‌సీబీ అభిమానులు మండిపడుతున్నారు. విరాట్ కోహ్లీని ఉద్దేశించే గిల్ ఈ పోస్ట్ పెట్టినట్లుగా ఆరోపణలు చేస్తున్నారు.
RCB vs GT : బెంగళూరు పై ధనాధన్ ఇన్నింగ్స్.. చాలా అవమానకరంగా అనిపించిందన్న జోస్ బట్లర్..
గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లతో కూడిన ఫోటోను పోస్ట్ చేస్తూ.. ‘మా దృష్టి ఆటపైనే ఉంది.. శబ్దం పై కాదు.’ అంటూ గిల్ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.
Eyes on the game, not the noise. pic.twitter.com/5jCZzFLn8t
— Shubman Gill (@ShubmanGill) April 2, 2025
ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గిల్ ఉద్దేశం ఏంటి? చిన్నస్వామి స్టేడియంలో గట్టిగా అరుస్తూ గోల చేసిన ఆర్‌సీబీ ఫ్యాన్స్ గురించా? లేక తన వికెట్ ను భువనేశ్వర్ కుమార్ తీసినప్పుడు కోహ్లీ అరుస్తూ సంబరాలు చేసుకోవడం గురించా అంటూ చర్చించుకుంటున్నారు.
కాగా.. చాలా మంది మాత్రం కోహ్లీని ఉద్దేశించే గిల్ ఈ పోస్ట్‌ను చేశాడని అంటున్నారు. ఈ క్రమంలో గిల్ పై మండిపడుతున్నారు.
ఇదిలా ఉంటే.. మ్యాచ్ అనంతరం గిల్ మాట్లాడుతూ చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీ 170 పరుగుల లోపు కట్టడి చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నాడు. త్వరగా ఆర్‌సీబీ వికెట్లు తీస్తే మ్యాచ్ మా వైపు మొగ్గుతుందని భావించామని, అనుకున్నట్లుగానే ప్రణాళికలను అమలు చేసినట్లుగా చెప్పుకొచ్చాడు. పిచ్ బట్టి బ్యాటింగ్ ఆర్డర్ మార్పులు చేసుకుని బరిలోకి దిగినట్లుగా వెల్లడించాడు. పరిస్థితులకు తగ్గట్లుగా ఆడామన్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. లియామ్ లివింగ్ స్టోన్ (54; 40 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. జితేశ్ శర్మ(33; 21 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), టిమ్ డేవిడ్ (32; 18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు)లు రాణించారు. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 4 ఓవర్లు వేసి 19 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. సాయి కిశోర్ రెండు వికెట్లు పడగొట్టాడు. అర్షద్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ణ, ఇషాంత్ శర్మలు తలా ఓ వికెట్ తీశారు.
అనంతరం జోస్ బట్లర్ (73 నాటౌట్; 39 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీ బాదగా, సాయి సుదర్శన్ (49; 36 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (30నాటౌట్; 18 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) దంచికొట్టడంతో లక్ష్యాన్ని గుజరాత్ 17.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.