ఏపీ క్రీడాకారులకు సీఎం జగన్ వరాలు

  • Publish Date - August 27, 2019 / 09:21 AM IST

అమరావతి : ఏపీ సీఎం జగన్ మోహన్  రెడ్డి   క్రీడాకారులపై వరాల జల్లు కురిపించారు. పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ‘క్రీడల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని, గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహించాలని అన్నారు.  మన రాష్ట్ర క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆయన  చెప్పారు.  

2014 రాష్ట్ర విభజన తర్వాత.. జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన మన రాష్ట్ర క్రీడాకారులకు నగదు పోత్సాహకాలు ఇద్దామని జగన్ అన్నారు. బంగారు పతకం సాధించిన వారికి రూ.5లక్షలు, వెండి పతకం సాధించిన వారికి రూ.4లక్షలు, కాంస్యం గెలుచుకున్న వారికి రూ.3 లక్షలు అందిద్దాం. జూనియర్, సబ్‌ జూనియర్‌ స్థాయి క్రీడాకారులనూ గుర్తించాలి.

ఈ కేటగిరీలో జాతీయ స్థాయిలో బంగారు పతకం వచ్చిన వారికి రూ.1.25లక్షలు, వెండిపతకం సాధిస్తే రూ.75వేలు, కాంస్య పతకం సాధించిన వారికి రూ.50 వేలు ఇచ్చి ప్రోత్సహిద్దాం. తగిన ప్రోత్సాహం ఇస్తేనే వీళ్లంతా పీవీ సింధూలుగా మారుతారు. ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం చేద్దాం. 29 నుంచి వారం రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగాలి’ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు