IND vs AUS : సెమీస్‌లో భారత్ పై విజయం సాధించేందుకు ఆసీస్ మాస్టర్ ప్లాన్.. రంగంలోకి డేంజరస్ ప్లేయర్..
భారత్‌తో కీలకమైన సెమీస్ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా ఓ నిర్ణయం తీసుకుంది.

Australia replace injured opener with 21 year old spin bowling all rounder for semifinal clash vs India
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆఖరి అంకానికి చేరుకుంది. గ్రూప్ స్టేజీలో మ్యాచ్‌లు పూర్తి అయ్యాయి. భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. మంగళ, బుధ వారాల్లో సెమీస్ మ్యాచ్‌లు జరగనుండగా కీలకమైన ఫైనల్ మ్యాచ్ ఆదివారం (మార్చి 9న) జరగనుంది.
మంగళవారం జరగనున్న తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్ చేరుకోవడంతో పాటు 2023లో వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఎదురైన ఓటమికి భారత్ ఘనంగా ప్రతీకారం తీర్చుకోవాలని టీమ్ఇండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఫైనల్ చేరుకోవాలని ఆసీస్ పట్టుదలగా ఉంది.
అయితే.. ఈ కీలకమైన మ్యాచ్‌కు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మాథ్యూ షార్ట్ దూరం అయ్యాడు. అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో షార్ట్ తొడకండరాల గాయం బారిన పడ్డాడు. ఆ మ్యాచ్‌లో అతడు నడవడానికే ఇబ్బంది పడ్డాడు. వైద్యులు అతడికి కొన్ని వారాలు విశ్రాంతి అవసరం అని సూచించారు. దీంతో అతడి స్థానంలో ఆల్‌రౌండర్ కూపర్ కొన్నోలీని ఆసీస్ ఎంపిక చేసింది. ఐసీసీ టెక్నికల్ కమిటీ ఈ భర్తీని ఆమోదించింది. దీంతో అతడు సెమీస్ ఆడేందుకు మార్గం సుగమమైంది.
కాగా.. కొన్నోలీకి అద్భుతమైన ఆల్‌రౌండ్ స్కిల్స్ ఉన్నాయి. ఇటీవల జరిగిన బిగ్‌బాష్ లీగ్‌లో ఈ స్పిన్ ఆల్‌రౌండర్ అదరగొట్టాడు. ఇప్పటి వరకు అతడు ఆసీస్ తరుపున ఆరు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో మూడు వన్డేలు ఉన్నాయి. దుబాయ్ పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉండే నేపథ్యంలో కొన్నోలీకి తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి.
స్పెషలిస్ట్ స్పిన్నర్ ఆడమ్ జంపాకి కూపర్ కొన్నోలీ జతకలిస్తే భారత బ్యాటర్లకు తిప్పలు తప్పకపోవచ్చు. ఇప్పటికే దుబాయ్ చేరుకున్న ఆసీస్ తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తోంది.
ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం నవీకరించిన ఆస్ట్రేలియా జట్టు..
స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ కారీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, స్పెన్సర్ జాన్సన్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుస్చాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘ, ఆడమ్ జంపా, కూపర్ కొన్నోలీ.