రాజస్థాన్ నాదే: IPL టీం కొనుగోలు చేస్తున్న అమితాబ్

రాజస్థాన్ నాదే: IPL టీం కొనుగోలు చేస్తున్న అమితాబ్

Updated On : June 23, 2021 / 3:29 PM IST

ఫుట్‌బాల్, కబడ్డీ ఇప్పుడు క్రికెట్‌లోకి అడుగుపెట్టనుంది బచ్చన్ కుటుంబం. ఐపీఎల్ ఫ్రాంచైజీలలో ఇటీవల సగం వాటాను అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపిన రాజస్థాన్ రాయల్స్‌ను బచ్చన్ కుటుంబం కొనుగోలు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మార్చి 29 నుంచి జరగనున్న ఐపీఎల్ 2019లో తామూ భాగం కావాలనే ఉత్సాహంతో బచ్చన్ కుటుంబం తొలుతగా చెన్నై సూపర్ కింగ్స్‌ను సంప్రదించిందట. వారు నిరాకరించడంతో రాజస్థాన్ రాయల్స్ వైపు మొగ్గు చూపారట.

బచ్చన్స్ సిబ్బంది ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ.. బచ్చన్ కుటుంబం రాజస్థాన్ రాయల్స్ యజమాని అయిన మనోజ్ బదలేను లండన్‌లో కలిసి ఈ విషయంపై చర్చించారని తెలిపారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ రాజస్థాన్ రాయల్స్ వాటాను కొనుగోలు చేసినట్లు అయితే రాజస్థాన్‌ జట్టులో వాటాదారులైన రెండో బాలీవుడ్ ప్రముఖులు అవుతారు. 2015 వరకూ శిల్పా శెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రాలు రాజస్థాన్ రాయల్స్‌లో వాటాదారులుగా ఉన్నారు.

ఐపీఎల్ 2015 అనంతరం రాజస్థాన్ రాయల్స్ జట్టు రెండేళ్ల పాటు నిషేదం ఎదుర్కొని 2018వ సీజన్‌లో పునరాగమనం చేసి క్వాలిఫైయింగ్ రౌండ్ వరకూ వచ్చింది. ప్రస్తుతం బచ్చన్ కుటుంబం ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్), ప్రొ కబడ్డీ లీగ్‌(పీకేఎల్)లలో వాటాదారులుగా ఉన్నారు. ఐఎస్ఎల్‌లో చెన్నై ఎఫ్‌సీ జట్టుకు, పీకేఎల్ ఫ్రాంచైజీలలో ఒకటైన జైపూర్ పింక్ పాంథర్స్‌కు అభిషేక్ బచ్చన్ వాటాదారుడిగా ఉన్నారు.