ENG vs IND : ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ కామెంట్స్.. రిస్క్ చేయకూడదని అనుకున్నాం.. లేకుంటేనా..
భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌ల అసాధారణ పోరాటం వల్లే తాము గెలవాల్సిన మ్యాచ్ డ్రాగా ముగిసిందన్నాడు బెన్‌స్టోక్స్.

Ben Stokes comments after Manchester test became draw
మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓ దశలో విజయం సాధించేలా కనిపించినప్పటికి టీమ్ఇండియా అసాధారణ పోరాటంతో మ్యాచ్ ను డ్రాగా ముగించింది. దీనిపై ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ స్పందించాడు. భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌ల అసాధారణ పోరాటం వల్లే తాము గెలవాల్సిన మ్యాచ్ డ్రాగా ముగిసిందన్నాడు.
మ్యాచ్ ముగిసిన తరువాత బెన్‌స్టోక్స్ మాట్లాడుతూ.. ఖచ్చితంగా డ్రా క్రెడిట్ మొత్తం జడేజా, సుందర్‌లదే అని చెప్పాడు. వారిని ఎంత పొగిడినా తక్కువేనన్నాడు. వ్యక్తిగత ప్రదర్శన కంటే కూడా జట్టు విజయం చాలా ముఖ్యమన్నాడు.
ఇక ఒక ఆల్‌రౌండర్ ఎలా ఆడాడు అనే విషయాన్ని మ్యాచ్ ఫలితం ద్వారానే అంచనా వేస్తామని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో తాము గెలిచిఉంటే తన ప్రదర్శనకు మరింత విలువ చేకూరేదన్నాడు. ఇక తాను ఒక విషయాన్నే ఎక్కువగా ఆటగాళ్లకు చెబుతానన్నాడు. జట్టు గెలిచేందుకు ఏం చేయడానికైనా వెనకాడకూడని చెబుతుంటానన్నాడు. ఇక తాను అదే పని చేశానన్నాడు.
బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్‌లో నిరంతం శ్రమించడం చాలా కఠినమైన పని తెలిపాడు. ఈ క్రమంలో తన శరీరం చాలా అలసిపోయిందన్నాడు. మ్యాచ్ సాగే కొద్ది పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిందన్నాడు. ఇక్కడ కుడి చేతి వాటం బ్యాటర్లు కాస్త ఇబ్బంది పడినా కూడా ఎడమ చేతి వాటం బ్యాటర్లు మాత్రం ఎలాంటి ఇబ్బంది పడలేదన్నాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో బెన్‌డకెట్, జాక్ క్రాలీల భాగస్వామ్యం తమ జట్టుకు బలమైన పునాది వేసిందన్నాడు.
ఇక ఇరు జట్లు కూడా నాణ్యమైన క్రికెట్ ఆడుతున్నాయన్నాడు. ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత్ అద్భుతంగా ఆడిందన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు తాము శాయశక్తుల ప్రయత్నించామని చెప్పుకొచ్చాడు. ఇక ఫలితం తేలదని భావించి ఆఖరి గంట సమయంలో మా పేసర్లతో రిస్క్ చేయకూడదని భావించే.. డ్రా కోసం ప్రతిపాదనను చేసినట్లు చెప్పాడు. అయితే.. జడ్డూ,సుందర్‌లు సెంచరీలు చేయాలని భావించారు. అందుకునే వారు మా ప్రతిపాదనను అంగీకరించలేదన్నాడు. ఈ క్రమంలోనే పార్ట్ టైమ్ బౌలర్లతో బౌలింగ్ చేయించానని స్టోక్స్ తెలిపాడు.
మ్యాచ్ సంక్షిప్త స్కోర్లు..
భారత్ తొలి ఇన్నింగ్స్ 358 ఆలౌట్
ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ 669 ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్ 425/4
ఫలితం.. డ్రా