ENG vs IND : మాంచెస్టర్‌లో టీమ్ఇండియా అద్భుత పోరాటం.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు.. ఆ ఇద్దరిని అలా ఎలా వదిలేస్తాం..
మాంచెస్టర్‌లో భారత్ అద్భుతం చేసింది.

Shubman Gill key comments after india draw Manchester test
మాంచెస్టర్‌లో భారత్ అద్భుతం చేసింది. ఓటమి తప్పదనుకున్న చోట టీమ్ఇండియా ప్లేయర్లు అసాధారణంగా పోరాడారు. దాదాపు రెండు రోజుల పాటు ఇంగ్లాండ్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. కాగా.. మ్యాచ్ డ్రాగా ముగియడం పట్ల టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ప్లేయర్ల పోరాటం పై ప్రశంసల వర్షంకురిపించాడు.
311 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్.. స్కోరు బోర్డుపై ఒక్క పరుగు చేర్చకముందే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. నాలుగో రోజు కెప్టెన్ శుబ్‌మన్ గిల్(103; 238 బంతుల్లో 12 ఫోర్లు), కేల్ రాహుల్(90; 230 బంతుల్లో 8 ఫోర్లు) పోరాడగా.. ఐదో రోజు రవీంద్ర జడేజా(107 నాటౌట్; 185 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్), వాషింగ్టన్ సుందర్(101 నాటౌట్ 206 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) అసాధారణ పోరాటం చేశారు.
మ్యాచ్ ముగిసిన తరువాత గిల్ మాట్లాడుతూ.. తీవ్ర ఒత్తిడిలోనూ తమ బ్యాటర్లు అద్భుతంగా ఆడారని కొనియాడాడు. తమ బ్యాటింగ్ ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ‘నిజం చెప్పాలంటే గత రెండు రోజులుగా మాపై ఎంతో ఒత్తిడి ఉంది. ఎందుకంటే వికెట్లు పడిపోతే మ్యాచ్ స్వరూపం మారిపోతుంది. ఐదో రోజు పిచ్ ఎలా స్పందిస్తుంది, ఏం జరుగుతుందో అనే ఆందోళన నెలకొంది. ‘అని గిల్ అన్నాడు.
అందుకనే ప్రతి బంతిని ఎంతో జాగ్రత్తగా ఆడాలని ముందే అనుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు. మ్యాచ్‌ను వీలైనంత ఆఖరి వరకు తీసుకెళ్లాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపాడు. జడేజా, సుందర్‌లు చాలా బాగా ఆడారన్నాడు. ‘వారు సెంచరీలు పూర్తి చేసుకోవాలని భావించాం. అందుకు వారు అర్హులు. అందుకనే ముందుగా మేం డ్రాకు అంగీకరించలేదు.’ అని గిల్ అన్నాడు.
ఇక ఈ సిరీస్‌లోని ప్రతి మ్యాచ్ ఆఖరి రోజు, చివరి సెషన్ వరకు సాగిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఈ సిరీస్ నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఇక భారత్ ప్రస్తుతం సిరీస్‌లో 2-1 తేడాతో వెనుకబడి ఉంది. ఈ విషయం పై మాట్లాడుతూ.. చివరి మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను సమం చేస్తామన్న ధీమాను వ్యక్తం చేశాడు.
బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తుంటా..
ఇక తాను బ్యాటింగ్ చేసే ప్రతిసారి మెరుగైన ప్రదర్శన చేయాలని అనుకుంటానని గిల్ చెప్పాడు. తన బ్యాటింగ్‌ను ఆస్వాదించాలని అనుకుంటాన్నాడు. వాస్తవానికి మొదటి ఇన్నింగ్స్‌లో మెరుగైన స్కోరు చేసినట్లుగా తెలిపాడు. మ్యాచ్‌లో భారత బ్యాటర్లకు మంచి ఆరంభాలు లభించినా కూడా వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలం అయ్యారు. దీని పై గిల్ మాట్లాడుతూ.. ఇలాంటి వికెట్ పై ఒకరు లేదా ఇద్దరు బ్యాటర్లు భారీ ఇన్నింగ్స్‌లు ఆడాల్సి ఉందన్నాడు. అయితే.. తాము అలా చేయలేకపోయామన్నాడు.