ENG vs IND : భారత్ పై ఘోర ఓటమి.. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కామెంట్స్.. మేం ఎక్కడ తప్పుచేశామంటే..
భారత్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఘోర పరాజయాన్ని చవిచూసింది.

Ben Stokes Comments viral after england lost match to India
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. 608 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 271 పరుగులకే కుప్పకూలింది. ఆకాశ్ దీప్ (6/99) అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లాండ్ 336 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండు ఇన్నింగ్స్‌ల్లో (269, 161) అదిరిపోయే ప్రదర్శన చేయడంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్‌లో ఓటమి తమను నిరాశకు గురి చేసిందని ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ తెలిపాడు. తమ జట్టు ఓటమికి ప్రధాన కారణం గిల్ అని అభిప్రాయపడ్డాడు.
మ్యాచ్ అనంతరం బెన్ స్టోక్స్ మాట్లాడుతూ.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం సరియైన నిర్ణయమేనని సమర్ధించుకున్నాడు. భారత జట్టు అన్ని విభాగాల్లో తమ కంటే మెరుగైన ప్రదర్శన చేసిందన్నాడు. ముఖ్యంగా రెండు తప్పిదాలు తమ విజయావకాశాలను దెబ్బతీశాయని చెప్పుకొచ్చాడు.
‘తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 5 వికెట్లను 200 పరుగులకే తీశాం. ఆ దశలో మ్యాచ్ మా చేతుల్లోకి వచ్చిందని భావించాం. అయితే.. వారిని త్వరగా ఆలౌట్ చేయలేకపోయాం.’ అని స్టోక్స్ తెలిపాడు.
ఆ తరువాత ఇంగ్లాండ్ జట్టు 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడం గురించి మాట్లాడుతూ.. మ్యాచ్‌లో ఇదే కీలక మలుపు అని, ఆ సమయంలో తిరిగి పుంజుకోవడం చాలా కష్టమైందన్నాడు. ఈ రెండు తప్పిదాలు తమ గెలుపు అవకాశాలను ప్రభావితం చేశాయన్నాడు.
ఇక మైదానంలోని పరిస్థితులు భారత జట్టుకే ఎక్కువగా అనుకూలించాయన్నాడు. ఈ మ్యాచ్‌లో భారత పేసర్లు చాలా మెరుగైన ప్రదర్శన చేశారని చెప్పుకొచ్చాడు. గెలిచేందుకు శాయశక్తులా కృషి చేశామని తెలిపాడు. అయితే.. ప్రత్యర్థి ఆధిపత్యం ప్రదర్శిస్తున్నప్పుడు తిరిగి పుంజుకోవడం చాలా కష్టం అని స్టోక్స్ తెలిపాడు.
ENG vs IND : కెప్టెన్‌గా తొలి టెస్టు విజయం.. పిచ్ పై శుభ్‌మన్ గిల్ ఆసక్తికర కామెంట్స్..
గిల్ అద్భుతం..
శుభ్‌మన్ గిల్ నమ్మశక్యం కాని ఆటను ప్రదర్శించాడని స్టోక్స్ అన్నాడు. అతడు తన బ్యాటింగ్‌తో తమ పతనాన్ని శాసించాడని చెప్పాడు. సుదీర్ఘమైన మ్యాచ్‌లో ఆఖరి రోజు బ్యాటింగ్ చేయడం ఎంతో కష్టం అని, అప్పటికే తమ జట్టు ఆటగాళ్లు పూర్తిగా అలసిపోయారన్నాడు. ఇక జెమీ స్మిత్ మంచి ప్రదర్శన చేస్తున్నాడన్నారు. ఈ ఓటమి గురించి చర్చిస్తామని లార్డ్స్‌లో ఖచ్చితంగా పుంజుకుంటామని స్టోక్స్ అన్నాడు.