ENG vs IND : కెప్టెన్‌గా తొలి టెస్టు విజయం.. పిచ్ పై శుభ్‌మన్ గిల్ ఆసక్తికర కామెంట్స్..
తొలి టెస్టులో ఓడిపోయినా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పై 336 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

Shubman Gill comments after team win the second test against England
టీమ్ఇండియా గొప్పగా పుంజుకుంది. తొలి టెస్టులో ఓడిపోయినా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పై 336 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ప్రస్తుతానికి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. టెస్టు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు ఇదే తొలి విజయం కావడం గమనార్హం.
ఈ మ్యాచ్‌లో గిల్ అసాధారణంగా రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో (269) ద్విశతకం బాదిన అతడు రెండో ఇన్నింగ్స్‌లో (161) భారీ సెంచరీ సాధించాడు. టీమ్ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించిన గిల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. ఈ సందర్భంగా గిల్ మాట్లాడుతూ.. ఓటమి నుంచి తిరిగి పుంజుకున్న తీరును ప్రశంసించాడు.
‘అవును. మొదటి టెస్టులో ఓడిపోయిన తరువాత మేము రెండో టెస్టులో బౌలింగ్, ఫీల్డింగ్‌లో గొప్పగా పుంజుకున్నాం. ఈ వికెట్ పై 400 నుంచి 500 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే ప్రత్యర్థి ఒత్తిడికి గురి అవుతుందని తెలుసు. బౌలర్లు చాలా చక్కగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా ఆకాశ్ దీప్ సరైన లెంగ్త్‌ల్లో బంతులు వేసి ప్రతి ఫలం పొందాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను తిప్పలు పెట్టాడు. నిజానికి ఇలాంటి పిచ్ పై అలా బౌలింగ్ చేయడం చాలా కష్టం. అతడొక అద్భుతం.’ అని గిల్ అన్నాడు.
ఇక ఎక్కువ వికెట్లు తీయకపోయినప్పటికి కూడా ప్రసిద్ధ్ కృష్ణ ను గిల్ ప్రశంసించాడు. అతడు వికెట్లు పడగొట్టకపోయినా చాలా చక్కగా బౌలింగ్ చేశాడని చెప్పాడు. మిగిలిన బౌలర్లు కూడా తమ వంతు పాత్ర పోషించాడని తెలిపాడు. ఇక తన వ్యక్తిగత ప్రదర్శన పట్ల సంతృప్తిని వ్యక్తం చేశాడు. తాను క్రీజులో ఉన్నప్పుడు ఓ బ్యాటర్‌గానే ఆలోచిస్తానని, కెప్టెన్‌గా ఆలోచించని స్పష్టం చేశాడు.
రెండో టెస్టు మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అతడు లార్డ్స్ వేదికగా జరిగే మూడో టెస్టు మ్యాచ్ ఆడతాడని గిల్ తెలిపాడు. ఇక ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లార్డ్స్ స్టేడియంలో ఆడాలని ప్రతి ఆటగాడు కలలు కంటాడని, అలాంటి మైదానంలో ఆడడంతో పాటు జట్టుకు నాయకత్వం వహించడం చాలా గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు గిల్ తెలిపాడు.