ENG vs IND : ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు.. టీమ్ఇండియాకు బెన్‌స్టోక్స్ వార్నింగ్.. అదంతా రెండేళ్ల కింద ముచ్చట.. ఇప్పుడెందుకు..
మూడో టెస్టుకు ముందు భారత జట్టుకు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ వార్నింగ్ ఇచ్చాడు.

Ben Stokes warning to team india ahead of 3rd test
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగుతోంది. తొలి టెస్టులో ఇంగ్లాండ్ గెలవగా రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది. ఇక నేటి (జూలై 10) నుంచి లండన్‌లోని లార్డ్స్ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ కీలక మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. కాగా.. ఈ మ్యాచ్ ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఎప్పటిలాగానే మ్యాచ్‌కు ఒక రోజు ముందు ఇంగ్లాండ్ తుది జట్టును ప్రకటించింది. తుది జట్టులో ఓ మార్పు చోటు చేసుకుంది. జోష్ టంగ్ స్థానంలో జోఫ్రా ఆర్చర్ జట్టులోకి వచ్చాడు. నాలుగేళ్ల తరువాత అతడు టెస్టు జట్టులోకి రావడం గమనార్హం. దీని పై స్టోక్స్ మాట్లాడుతూ.. ఆర్చర్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు.
అదే సమయంలో భారత జట్టుకు వార్నింగ్ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థిని తీవ్రంగా దెబ్బతీసి విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యాన్ని కైవసం చేసుకుంటామనే ధీమాను వ్యక్తం చేశాడు. “హెడింగ్లీలో మేము గెలిచాం. గత మ్యాచ్‌లో వారు గెలిచారు. రెండు అత్యుత్తమ జట్లు పోటీపడుతున్నప్పుడు ఇలాగే ఉంటుంది. మేము మా ప్రత్యర్థిని గౌరవిస్తాం. ఈ మ్యాచ్‌లో మేము వారిని తీవ్రంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తాం. మేము గెలుస్తాం.” అని బెన్‌స్టోక్స్ అన్నాడు.
అదంతా రెండేళ్ల కిందటి ముచ్చట…
రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియాతో లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బెన్‌స్టోక్స్ ఓ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 155 పరుగులతో రాణించాడు. తాజాగా ఆ ఇన్నింగ్స్‌కు సంబంధించిన ప్రశ్న అతడికి ఎదురైంది. దీనిపై మాట్లాడుతూ.. అదంతా రెండేళ్ల క్రితం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధం లేదు. ఇక ఈ సారి కూడా లార్డ్స్ పిచ్‌లో ఎలాంటి మార్పు ఉండదు. అయితే.. మేము భారీ స్కోర్లు చేసేందుకు ప్రయత్నిస్తాం. అదే సమయంలో భారత్‌ను కట్టడి చేస్తాం. అని స్టోక్స్ తెలిపాడు.
Rohit Sharma – Virat Kohli : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..
భారత్‌తో మూడో టెస్టు కోసం ఇంగ్లాండ్ తుది జట్టు..
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్.