T20 World Cup 2026 : మరో రోజులో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్.. ఆస్ట్రేలియాకు బిగ్ షాక్..
టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026) ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్ తగిలింది.
Big Shock to Australia pacer Josh Hazlewood has been ruled out
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్ తగిలింది. ఈ మెగాటోర్నీ నుంచి సీనియర్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ తప్పుకున్నాడు. హేజిల్‌వుడ్ తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. ఇప్పటికే మరో సీనియర్ పేసర్ కమిన్స్ దూరం కాగా.. తాజాగా హేజిల్‌వుడ్ తప్పుకోవడం ఆసీస్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు.
నవంబర్ 12న షెఫీల్డ్ షీల్డ్ టోర్నీ ఆడుతూ హేజిల్‌వుడ్ తొడ కండరాల గాయం బారిన పడ్డాడు. అప్పటి నుంచి అతడు ఆటకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. టీ20 ప్రపంచకప్ 2026 సూపర్ 8 దశ నాటికి అతడు కోలుకుంటాడని భావించి ఈ మెగాటోర్నీకి సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు. అయితే.. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో గాయం మానేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని తేలింది.
దీనిపై జాతీయ సెలెక్టర్ టోనీ డోడెమైడ్ మాట్లాడుతూ.. సూపర్ 8 నాటికి హేజిల్‌వుడ్ కోలుకుంటాడని మేము భావించాము. తాజా సమాచారం ఏంటంటే అతడు కోలుకునేందుకు మరింత సమయం పట్టనుంది. అతడిని త్వరగా మైదానంలోకి తీసుకురావాలని భావిస్తే అప్పుడు గాయం తీవ్రత పెరిగి అతడి కెరీర్‌కే ముప్పుగా మారొచ్చు. అందుకనే అతడి విషయంలో మేం ఏ మాత్రం తొందరపడడం లేదు. అని చెప్పుకొచ్చాడు. ఇక హేజిల్‌వుడ్ స్థానంలో ప్రస్తుతానికి ఎవ్వరిని తీసుకోలేదు. పరిస్థితి బట్టి తరువాత నిర్ణయం తీసుకుంటామని టోనీ తెలిపాడు.
మిచెల్ స్టార్క్ ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించగా, కమిన్స్, హేజిల్‌వుడ్ గాయాల కారణంగా టీ20 ప్రపంచకప్ 2026 నుంచి తప్పుకున్నారు. ఈ ముగ్గురు స్టార్ పేసర్లలో కనీసం ఒక్కరు కూడా లేకుండా 2011 మార్చి తరువాత ఆస్ట్రేలియా ఆడుతున్న తొలి ప్రపంచకప్ ఇదే కావడం గమనార్హం.
టీ20 ప్రపంచ కప్ 2026 కోసం ఎంపిక చేసిన ఆస్ట్రేలియా జట్టు ఇదే..
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ రెన్షా, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.
ట్రావెలింగ్ రిజర్వ్.. సీన్ అబాట్
