CCL 2025 : ఒక్క టికెట్ కొంటే రెండు మ్యాచ్‌లు.. సీసీఎల్ బంపర్ ఆఫర్ !
సీసీఎల్11వ సీజన్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం నాలుగు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తోంది.

CCL 2025 two matches in Uppal in Two days
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) 11వ సీజన్ ఫిబ్రవరి 8న ప్రారంభమైంది. మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో మొత్తం నాలుగు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో రెండు తెలుగు వారియర్స్ కు సంబంధించిన మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ రెండు మ్యాచ్‌లు శుక్ర, శనివారాల్లో ఉప్పల్‌లో జరగనున్నాయి.
ఉప్పల్‌లో జరిగే మ్యాచ్‌ల వివరాలు..
14న మధ్యాహ్నాం 2 గంటలకు చెన్నై రైనోస్‌తో కర్ణాటక బుల్డోజర్స్ తలడనుండగా, సాయంత్రం 6.30 గంటలకు తెలుగు వారియర్స్‌తో భోజ్‌పురి దబాంగ్స్ ఆడనుంది. ఇక 15న మధ్యాహ్నాం 2 గంటలకు ముంబై హీరోస్‌తో కర్ణాటక బుల్డోజర్స్ తలపడనుండగా సాయంత్రం 6.30 గంటలకు తెలుగు వారియర్స్‌తో చెన్నై రైనోస్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లు బుక్ మై షో యాప్‌లో అందుబాటులో ఉన్నాయి.
సీసీఎల్ మ్యాచ్‌ల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. బుధవారం ఉప్పల్ స్టేడియంలో సీసీఎల్, క్రికెట్ స్టేడియం నిర్వాహకులు, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. సీసీఎల్ మ్యాచ్‌లకు అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో మ్యాచ్‌లకు ఎలాంటి విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.
నిబంధన ప్రకారమే కూల్ డ్రింక్స్, పుడ్ ఐటమ్స్ విక్రయించాలని, ప్రతి ఒక్కరి కదలికలపై నిఘా ఉంచాలన్నారు. వాహనాల పార్కింగ్ విషయంలోనూ, మీడియాతో పాటు ఇతరులకు ఇచ్చే పాసుల జారీలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌ను తెలుగు వారియర్స్ ఓటమితో మొదలుపెట్టింది. కర్ణాటక బుల్డోజర్స్ చేతిలో 46 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో ఉప్పల్‌లో జరగనున్న మ్యాచ్‌ల్లో విజయకేతనం ఎగురవేయాలని తెలుగు వారియర్స్ కోరుకుంటున్నారు.