IND vs ENG : మూడో వన్డే అనంతరం రోహిత్, బట్లర్ కామెంట్స్.. చాలా చాలా సంతోషంగా ఉంది.. మరోసారి అదే తప్పు..
మూడు వన్డేల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. సిరీస్ విజయం పై కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు.

Rohit Sharma and Jos Buttler comments after 3rd odi in Ahmedabad VM
ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో 142 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై భారత్ విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో తనకు చాలా చాలా ఆనందంగా ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. నచ్చిన విధంగా ఆడేందుకు జట్టులో ప్రతి ఒక్క ఆటగాడికి స్వేచ్ఛ ఉందన్నాడు.
మూడో వన్డే మ్యాచ్‌లో విజయం అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. టీమ్ఇండియా వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చినట్లు చెప్పాడు. సిరీస్ ఆసాంతం ఆటగాళ్లు అద్భుతంగా ఆడారన్నాడు. ఈ సిరీస్‌లో తాము ఎలాంటి తప్పులు చేయలేదన్నాడు. అయినప్పటికి జట్టుగా ఇంకా మెరుగుపరచుకోవాల్సిన అంశాలు ఉన్నాయన్నాడు. ఏ ఛాంపియన్ జట్టు అయినా సరే ప్రతి గేమ్ తరువాత మెరుగుపరచుకోవాల్సిన అంశాల పై దృష్టి సారిస్తూ ముందుకు సాగుతుందన్నారు.
IND vs ENG : వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. మూడో వన్డేలో ఇంగ్లాండ్ పై ఘన విజయం
జట్టులో ఆటగాళ్ల స్థానాలకు భద్రత ఉందన్నాడు. ప్రతి ప్లేయర్‌కు తనకు నచ్చిన విధంగా మైదానంలో ఆడే స్వేచ్ఛ ఉందని చెప్పాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో ఆడిన విధంగానే తాము ముందుకు సాగుతున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే.. కొన్ని సార్లు అనుకున్న ఫలితాలు రాకపోవచ్చునని అయినప్పటికి కూడా ఆటతీరులో మాత్రం మార్పు ఉందన్నాడు.
మరోసారి అదే తప్పు..
తమ జట్టు ఓటమికి బ్యాటింగే ప్రధాన కారణం అని ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ చెప్పాడు. భారత్ టూర్ మొత్తంలో తమ బ్యాటర్లు స్థాయికి తగ్గట్లుగా ఆడలేదన్నాడు. ‘మేము అనుకున్న ప్రణాళికలను మైదానంలో విజయవంతంగా అమలు చేయలేకపోయాం. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా అద్భుతంగా ఆడింది. భారీ స్కోర్‌ను ముందుంచింది. శుభ్‌మన్ గిల్ చాలా గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు.’ అని జోస్ బట్లర్ అన్నాడు.
ఇక అద్భుతమైన ప్రారంభం దక్కినా కూడా మరోసారి దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయినట్లు బట్లర్ తెలిపాడు. బ్యాటర్లు లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలని సూచించాడు. అప్పుడే మ్యాచ్‌లో విజయం సాధించేందుకు అవకాశం ఉంటుందన్నాడు. భారత్‌తో సిరీస్ ఓడిపోయినప్పటికి తమ జట్టు అద్భుతమైన జట్టు అని, ఛాంపియన్స్ ట్రోఫీ ఛాలెంజ్‌కు తాము సిద్ధంగా ఉన్నామన్నాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (112; 102 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకంతో చెలరేగాడు. బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ (78; 64 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (52; 55 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు చేశారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 34.2 ఓవర్లలో 214 పరుగులకు కుప్పకూలింది. దీంతో భారత్ 142 పరుగుల తేడాతో విజయం సాధించింది. వన్డేల్లో ఇంగ్లాండ్ పై భారత్ కు పరుగుల పరంగా రెండో అతి పెద్ద విజయం ఇదే.