Crickets Most Controversial Celebrations : విరాట్ కోహ్లీ నుంచి ఫర్హాన్ వరకు.. కాంట్రవర్సీ సెలబ్రేషన్స్..
మ్యాచ్ సమయంలో పాక్ ఆటగాడు సాహిబ్జాదా ఫర్హాన్ అర్థశతకం సాధించిన అనంతరం చేసుకున్న సెలబ్రేషన్స్ వివాదంగా మారాయి(Crickets Most Controversial Celebrations).

Crickets Most Controversial Celebrations Kohli Middle Finger to Farhan Gun Salute
Crickets Most Controversial Celebrations : క్రికెట్‌ను జెంటిల్ మేన్ గేమ్ అని అంటూ ఉంటారు. ఓడినా, గెలిచినా కూడా ఇరు జట్ల ఆటగాళ్లు ఎంతో హుందగా ప్రవర్తిస్తూ ఉండడంతోనే ఈ గేమ్‌కు ఆ పేరు వచ్చింది. అలాంటి ఈ గేమ్‌లో కొందరు ఆటగాళ్ల ప్రవర్తన వల్ల చెడ్డపేరు వస్తూ ఉంటుంది. ఆసియాకప్ 2025 సూపర్-4లో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా భారత్, పాక్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. అయితే.. మ్యాచ్ సమయంలో పాక్ ఆటగాడు సాహిబ్జాదా ఫర్హాన్ అర్థశతకం సాధించిన అనంతరం చేసుకున్న సెలబ్రేషన్స్ వివాదంగా మారాయి (Crickets Most Controversial Celebrations).
ఈ క్రమంలో కొంత మంది ఆటగాళ్లు మైదానంలో చేసిన చేష్టలు, అందుకు ఎదుర్కొన్న శిక్షలు గురించి ఓ సారి చూద్దాం..
సాహిబ్జాదా ఫర్హాన్..
పాకిస్తాన్ ఓపెనర్ అయిన సాహిబ్జాదా ఫర్హాన్ ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాట్‌తో రాణించాడు. 45 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు బాది 58 పరుగులు చేశాడు. అయితే.. హాఫ్ సెంచరీ తరువాత అతడు డగౌట్ వైపు తిరిగి తన బ్యాట్‌తో గన్ పట్టుకుని ఫైరింగ్ చేసిన తరహాలో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.
ప్రస్తుతం భారత్, పాక్ ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అతడు చేసిన చర్య రెచ్చగొట్టేలా ఉందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ప్రస్తుతానికి ఐసీసీ ఇంకా దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ.. గతంలో ఇలాంటి చర్యలకు జరిమానాలు, డీమెరిట్ పాయింట్లను విధించింది.
విరాట్ కోహ్లీ..
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ 2012లో సిడ్నీ వేదికగా జరిగిన ఓ మ్యాచ్‌లో అనుచితంగా ప్రవర్తించాడు. మైదానంలోని ఆస్ట్రేలియా ఫ్యాన్స్ దుర్భాషలాడటంతో విసుగుచెందిన కోహ్లీ.. తన మిడిల్ ఫింగర్‌ను స్టాండ్స్ వైపు చూపించాడు. దీనిని ఐసీసీ లెవెల్ -1 నేరంగా పరిగణించింది. అతడి మ్యాచ్ ఫీజులో 50 జరిమానా విధించబడింది.
కగిసో రబాడ..
దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ 2018లో ఆస్ట్రేలియాతో జరిగిన ఓ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్‌ను ఔట్ చేశాడు. ఆ ఆనందంలో తన భుజాలను ఎగురువేసుకుంటూ పెవిలియన్‌కు వెలుతున్న స్టీవ్ స్మిత్ ను తాకుతూ దూకుడుగా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. దీనిని ఐసీసీ లెవెల్-2 నేరం కింద పరిగణించి రెండు టెస్టు మ్యాచ్‌ల సస్పెషన్ విధించింది. ఇది పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. చివరకు ఐసీసీ శిక్షను రద్దు చేసింది.
షకీబ్ అల్ హసన్..
ఢాకీ ప్రీమియర్ లీగ్ 2021లో ఓ మ్యాచ్‌లో అంపైరింగ్ నిర్ణయంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ స్టంప్స్‌ను కాలితో తన్నాడు. దీనిని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీవ్రంగా పరిగణించింది. మూడు మ్యాచ్‌ల సస్పెషన్‌తో పాటు భారీ జరిమానాను విధించింది. షకీబ్ తీరుపై నెటిజన్లు సైతం విమర్శలు చేశారు.
డేవిడ్ వార్నర్..
2015లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా ఆటగాడు రోహిత్ శర్మను డేవిడ్ వార్నర్ తిట్టడమే కాకుండా అనుచితంగా సెడాంప్ ఇచ్చాడు. దీంతో వార్నర్ మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విదించడంతో పాటు రెండు డీమెరిట్ పాయింట్లను అతడి ఖాతాలో ఐసీసీ చేర్చింది.
బెన్‌స్టోక్స్..
2017లో లీడ్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో ఔటైన తరువాత పెవిలియన్‌కు వెలుతూ బెన్‌స్టోక్స్ అభ్యంతరకరమైన చేతి సంజ్ఞ చేశాడు. దీనిని తీవ్రంగా పరిగణించిన ఐసీసీ అతడిని మందలించింది. అంతేకాకుండా అతడి మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించింది.
ఐసీసీ ప్రవర్తనా నియమావళి ప్రకారం..
* లెవల్-1 ఉల్లంఘనలు (చిన్న హావభావాలు/దుర్వినియోగం) – మ్యాచ్ ఫీజులో 50% వరకు జరిమానాలు, డీమెరిట్ పాయింట్లు విధింపు.
* లెవల్-2 ఉల్లంఘనలు (తీవ్రమైన సెండాఫ్‌లు/భౌతిక సంబంధం) – మ్యాచ్ ఫీజులో 100% వరకు జరిమానాలు, మ్యాచ్ సస్పెన్షన్లు.
* లెవల్-3 & 4 ఉల్లంఘనలు – పదే పదే తప్పిదాలు చేయడం లేదా, తీవ్రమైన నేరాలకు గానూ దీర్ఘకాలిక నిషేదాలను విధిస్తారు.