IPL 2025: పాపం చెన్నై జట్టు.. సీఎస్కే ప్లే ఆఫ్స్‌కి చేరే అదృష్టం వరించాలంటే ఇలా జరగాల్సిందే.. లేదంటే..
సీఎస్కే ప్లేఆఫ్స్‌కు చేరుకునే ఆప్షన్ సవాలుతో కూడుకున్న విషయమే.

Pic: @ChennaiIPL (X)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కి గొప్ప చరిత్ర ఉంది. గతంలో అనేక సీజన్‌లలో ఆ జట్టు ఆధిపత్యం చెలాయించింది. గతంలో 5 సార్లు ఐపీఎల్ టైటిళ్లను సొంతం చేసుకుంది.
ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ మొత్తం 139 మ్యాచుల్లో విజయాలు సాధించింది. రెండు ఐపీఎల్ సీజన్లలో (2016, 2017) ఆడలేకపోయినప్పటికీ ఈ జట్టు ఇన్ని మ్యాచుల్లో గెలవడం గమనార్హం.
ముంబై జట్టు మొత్తం 143 మ్యాచులు గెలిచి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో అగ్రస్థానంలో ఉంటే చెన్నై రెండో స్థానంలో కొనసాగుతోంది. అటువంటి జట్టు ప్రస్తుతం ఐపీఎల్ సీజన్‌లో మాత్రం పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక విజయం మాత్రమే సాధించి మూడు మ్యాచుల్లో ఓడిపోయింది. ఆ జట్టు ఖాతాలో 2 పాయింట్లు, నెట్‌రన్ రేట్ -0.891 ఉన్నాయి. దీంతో ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే ఆ జట్టు వచ్చే మ్యాచుల్లో బాగా కష్టపడాల్సి ఉంటుంది.
Also Read: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇలా అయిపోయిందేంటి? ఇక ఇలా చేస్తేనే ప్లే ఆఫ్స్ చేరే ఛాన్స్..
ప్లేఆఫ్ చేరాలంటే?
ఐపీఎల్‌లో జట్లు సాధారణంగా ప్లేఆఫ్‌లో స్థానం సంపాదించడానికి కనీసం 16 పాయింట్లు ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంటాయి. 18 పాయింట్లు ఉంటే ప్లేఆఫ్‌లో స్థానం మరింత కన్ఫార్మ్ అవుతుంది. సీఎస్కే ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడి మూడు ఓడడంతో ఆ జట్టు ఖాతాలో 2 పాయింట్లు ఉన్నాయి.
సీఎస్కే జట్టు ఇంకా 10 లీగ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. 16 పాయింట్ల స్థాయికి చేరుకోవడానికి సీఎస్కే మిగిలిన 10 మ్యాచ్‌లలో కనీసం 7 గెలవాలి. అంటే, అవసరమైన పాయింట్లను సాధించడానికి సీఎస్కే ఆయా మ్యాచ్‌లలో అధిక శాతం విజయాలను సాధించాల్సి ఉంటుంది.
అలాగే, నాలుగు మ్యాచుల్లో ఓడితే సీఎస్కే ప్లే ఆఫ్ అవకాశాలు ఇతర జట్ల ప్రదర్శనపై కూడా ఆధారపడి ఉంటాయి. దీంతో సీఎస్కే నెట్ రన్ రేట్‌ను కూడా మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉంది. సీఎస్కే ప్లేఆఫ్స్‌కు చేరుకునే ఆప్షన్ సవాలుతో కూడుకున్నది అయినప్పటికీ, మిగిలిన మ్యాచ్‌లలో బాగా ఆడితే మాత్రం సాధ్యమే.