David Warner : పాకిస్థాన్ సూపర్ లీగ్ కెప్టెన్ల ప్రెస్ కాన్ఫరెన్స్.. తీవ్ర అసహనం వ్యక్తం చేసిన డేవిడ్ వార్నర్.. ఇక్కడ స్కూల్ పిల్లలు ఉన్నారు
విలేకరుల సమావేశంలో ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు, కరాచీ కింగ్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (David Warner) తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.
David Warner get Irritated At Pakistan Super League Captains Press Conference
- పీఎస్ఎల్ కెప్టెన్ల ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వార్నర్ అసహనం
- ఇక్కడ కొంది మంది చిన్న పిల్లలు ఉన్నారు అంటూ కామెంట్స్
David Warner : పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) గురువారం నుంచి ప్రారంభం కానుంది. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో నెలకొన్న ఇంధన సంక్షోభం కారణంగా ఈ మెగాటోర్నీలోని మ్యాచ్‌లను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనున్నారు. కాగా.. ఈ మెగాటోర్నీ ఆరంభానికి ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు, కరాచీ కింగ్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (David Warner) తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.
లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో పీఎస్ఎల్లోని అన్ని జట్ల కెప్టెన్లు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వార్నర్.. తమ జట్టు బలాలు, వ్యూహాల గురించి వివరిస్తున్నాడు. వార్నర్ మాట్లాడుతుండగా.. హైదరాబాద్ కింగ్స్‌మెన్ కెప్టెన్ మార్నస్ లబుషేన్, లాహోర్ ఖలందర్స్ కెప్టెన్ షహీన్ షా అఫ్రిది, రావల్సిండి కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్, పెషావర్ జల్మీ కెప్టెన్ బాబర్ ఆజామ్, క్వెట్టా గ్లాడియేటర్స్ కెప్టెన్ సౌద్ షకీల్ ఒకరితో ఒకరు సరదాగా మాట్లాడుకుంటున్నారు.
View this post on Instagram
దీనిపై వార్నర్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశాడు. తన మాటలను ఆపి.. ఇక్కడ ఏం జరుగుతోంది? క్షమించండి.. ఇక్కడ కొంతమంది స్కూల్ పిల్లలు ఉన్నట్లున్నారు. వీళ్లు తమను తాము ‘ప్రీమియం ప్లేయర్స్’ అని పిలుచుకుంటున్నారు అయితే.. వీరి ప్రవర్తన మాత్రం చిన్న పిల్లల్లా ఉంది. విలేకరుల సమావేశంలో ఎలా ఉండాలో వీరికి తెలియడం లేదు అంటూ మండిపడ్డాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వార్నర్‌కు నెటిజన్లు మద్దతు ఇస్తున్నారు. ఓ కెప్టెన్ మాట్లాడేటప్పుడు అలా చేయడం సరికాదని మండిపడుతున్నారు.
