Dinesh Karthik: ఓరి నీ తొందరపాటు తగలెయ్య.. దినేశ్ కార్తీక్ పై మండిపడుతున్న అభిమానులు
వరుసగా రెండో మ్యాచ్ లోనూ తన సహచరుడి రనౌట్ కు కారణమైన దినేశ్ కార్తీక్ పై సోషల్ మీడియాలో ఆర్ సీబీ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు.

Dinesh Karthik: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ పై క్రికెట్ అభిమానులు గుర్రుగా ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ ల్లో డీకే దారుణంగా విఫలమయ్యాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడటానికి అవసరమయ్యే ఒక్క ఇన్నింగ్స్ కూడా అతడి నుంచి ఈ సీజన్ లో రాలేదు. అతడు విఫలమవడమే కాకుండా జట్టును కూడా కష్టాల్లో పడేస్తున్నాడు. అందుకే ఆర్ సీబీ ఫ్యాన్స్ అతడిపై కోపంగా ఉన్నారు.
డీకే తొందరపాటు
కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కీలక సమయంలో దినేశ్ కార్తీక్ (Dinesh Karthik) చేసిన తప్పిదం అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. డీకే కారణంగా సుయాష్ ప్రభుదేసాయి (Suyash Prabhudessai) రనౌటయ్యాడు. దీంతో అతడు నిరాశగా వెనుదిరిగాడు. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన బెంగళూరు జట్టును కార్తీక్ ఆదుకుంటాడని అభిమానులు భావించారు. దానికి తగ్గట్టుగానే ప్రభుదేసాయితో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పే దిశగా కార్తీక్ బ్యాటింగ్ సాగింది. అయితే డీకే తొందరపాటు కారణంగా సుయాష్ రనౌట్ అయ్యాడు. కష్టసాధ్యమైన రెండో పరుగు కోసం సుయాష్ ను బలిచేశాడు డీకే. కాసేపటికి తాను కూడా స్వల్ప స్కోరు(22)కే వికెట్ సమర్పించుకోవడం ఆర్ సీబీ ఓటమి ఖాయమైంది.
40 రనౌట్లు..
వరుసగా రెండో మ్యాచ్ లోనూ తన సహచరుడి రనౌట్ (run out)కు కారణమైన దినేశ్ కార్తీక్ పై సోషల్ మీడియాలో ఆర్ సీబీ ఫ్యాన్స్ (RCB Fans) విరుచుకుపడుతున్నారు. వరుసగా రెండు మ్యాచ్ ల్లో సుయాష్ ప్రభుదేసాయి రనౌట్ కు డీకే కారణమయ్యాడని.. అతడు మళ్లీ కామెంటరీ బ్యాక్స్ కు వెళ్లిపోవాలని అంటున్నారు. బెంగళూరు జట్టుకు భారంగా మారిన దినేశ్ కార్తీక్.. అనవసర రనౌట్లతో టీమ్ ను కష్టాల్లో పడేస్తున్నాడని మండిపడుతున్నారు. ఇప్పటివరకు దినేశ్ కార్తీక్ 40 రనౌట్లలో భాగస్వామిగా ఉన్నాడని.. 27సార్లు అతడితో పాటు ఉన్న సహచర ఆటగాడు పెవిలియన్ చేరగా.. 13 పర్యాయాలు డీకే అవుటయ్యాడంటూ లెక్కలు తీస్తున్నారు.
Also Read: పాపం యష్ దయాల్.. ఆ ఒక్క ఓవర్‌తో.. ఇప్పట్లో ఆడడం కష్టమే అంటున్న హార్దిక్
గత సీజన్ లో కొన్ని హీరోయిక్ ఇన్నింగ్స్ తో జట్టును గెలిచిపించిన వెటరన్ వికెట్ కీపర్ ఈసారి మాత్రం విఫలమయ్యాడు. ఐపీఎల్ 2023లో పరుగులు చేయడానికి చాలా కష్టపడుతున్నాడు. ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. మిగతా మ్యాచ్ ల్లో అయినా మెరిపిస్తాడో, లేదో చూడాలి.
Also Read: టీ20ల్లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ఒకే స్టేడియంలో 3 వేల పరుగులు