ధోనీ ముందు నేను.. ఓ ఫస్ట్ ఎయిడ్ కిట్ అంతే..

ఐపీఎల్ సీజన్ 12 భీకర్ షాట్లతో ఉత్కంఠభరితమైన విజయాలతో సాగిపోతోంది. తర్వాతి మ్యాచ్‌కు ఎలాంటి ప్రణాళికలతో బరిలోకి దిగాలనే యోచనలోనే ఉన్నారు కెప్టెన్లు. అదే సమయంలో సోమవారం వరల్డ్ కప్ జట్టులో దినేశ్ కార్తీక్ పేరు ఉందని విన్న వెంటనే ఎగిరి గంతేశాడట. దానికి కారణం లేకపోలేదు.
12ఏళ్ల తర్వాత భారత వరల్డ్ కప్ జట్టులో భాగమవడం మామూలు విషయం కాదు కదా. ఈ సందర్భంగా కేకేఆర్ టీం ఉంటున్న హోటల్ బయట జరిగిన మీడియా సమావేశంలో కార్తీక్ పాల్గొని ఇలా మాట్లాడాడు. ‘ఇదొక ప్రత్యేక సందర్భం. నేను చాలా అదృష్టవంతుణ్ని గొప్పగా భావిస్తున్నాను. ఎంతో కాలం ఎదురుచూసిన తర్వాత 2017లో మళ్లీ టీమిండియాలో చోటు దక్కింది’
‘అప్పటి నుంచి వరల్డ్ కప్‌లో ఆడాలనే తాపత్రయపడ్డా. చాలా వరకూ దినేశ్ కార్తీక్ వరల్డ్ కప్ ఆడడనే అన్నారు. కానీ, రెండో వికెట్ కీపర్‌గా జట్టులోకి సెలక్ట్ చేశారు. మహేంద్ర సింగ్ ధోనీ మెయిన్ కీపర్‌గా ఉంటే నా అవసరం రాదనే అనుకుంటా. జట్టులో ధోనీ ఉంటే.. నేను ఫస్ట్ ఎయిడ్ కిట్ లాంటివాడిని. టోర్నీ మధ్యలో ధోనీ గాయానికి గురైతే ఆ రోజుకు నేను బ్యాండ్ ఎయిడ్‌లా పనిచేస్తా. నెం.4 స్థానంలో బ్యాటింగ్ చేయడానికైనా సిద్ధంగా ఉన్నా’
‘రిషబ్ పంత్ ఓ స్పెషల్ ప్లేయర్. భవిష్యత్‌లో టీమిండియా తరపున మంచి క్రికెటర్‍గా అవుతాడనడం ఖాయం. వరల్డ్ కప్ టీంలో ధోనీతో కలిసి నేను ఆడుతున్నప్పడు ఇక పంత్ ఎందుకు. విజయ్ శంకర్ జట్టులో ఉండడం నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే జట్టులో ఒకరితోనైనా నేను తమిళంలో మాట్లాడుకోవచ్చు కదా’ అని దినేశ్ కార్తీక్ ముగించాడు.