ENG vs IND : ఇంగ్లాండ్ గడ్డపై తొలి సెంచరీ.. యశస్వి జైస్వాల్ కామెంట్స్ విన్నారా?
విదేశీ పర్యటనల్లో తన ట్రాక్ రికార్డును కొనసాగిస్తున్నాడు టీమ్ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్.

Yashasvi Jaiswal comments
విదేశీ పర్యటనల్లో తన ట్రాక్ రికార్డును కొనసాగిస్తున్నాడు టీమ్ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్. గతేడాది అరంగ్రేటంలోనే వెస్టిండీస్ పై సెంచరీ చేసిన ఈ ఎడమచేతి వాటం ఆటగాడు ఆ తరువాత ఆస్ట్రేలియా, ఇప్పుడు ఇంగ్లాండ్ గడ్డ పై శతక గర్జన చేశాడు. హెడింగ్లీ వేదికగా ఇంగ్లాండ్‌తో శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆటలో సెంచరీతో చెలరేగాడు. మొత్తంగా 159 బంతులు ఆడిన యశస్వి 16 ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో 101 పరుగులు సాధించాడు.
తొలి రోజు ఆట ముగిసిన తరువాత యశస్వి జైస్వాల్ మాట్లాడుతూ.. తనకు ప్రతి శతకం ఎంతో ప్రత్యేకం అని చెప్పుకొచ్చాడు. గిల్ సహకారంతోనే ఈ సెంచరీ సాధ్యమైందన్నాడు. ఈ సిరీస్ కోసం గత రెండు వారాలుగా చాలా చక్కగా సన్నద్ధం అయినట్లుగా తెలిపాడు. ఇంగ్లాండ్‌లో బ్యాటింగ్‌ను ఎంతో ఆస్వాదించినట్లు తెలిపాడు.
ENG vs IND : రెండో రోజు ఆటకు ముందు టీమ్ఇండియాకు బ్యాడ్ న్యూస్..
‘ఇంగ్లాండ్ గడ్డపై తొలి సిరీస్‌లోనే శతకం చేయడం మరిచిపోలేని అనుభూతి. ఇక్కడ బ్యాటింగ్ చేయడాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నాను. స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు పడిపోయిన తరువాత .. గిల్, నేను ఇన్నింగ్స్‌ను నిలబెట్టాం. బ్యాటింగ్ చేసే సమయంలో మేమిద్దం చాలా మాట్లాడుకున్నాం. సెషన్ బై సెషన్ లక్ష్యంగా ఆడాలని అనుకున్నాము. మా ఇద్దరి మధ్య ఎంతో చక్కని సమన్వయం ఉంది.’ అని యశస్వి అన్నాడు.
కెప్టెన్ గిల్ ఎంతో ప్రశాంతంగా ఉంటాడని యశస్వి తెలిపాడు. అతడు అలా ఉండటాన్ని నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉంటూ ఎంతో ఆస్వాదిస్తాను అని చెప్పాడు. తాను పరిస్థితులకు తగ్గట్లుగా ఆడడం పై మాత్రమే దృష్టి పెడతానన్నాడు. కండరాలు పట్టేసినా సరే జట్టును పటిష్ట స్థితిలో నిలపాలనే ఉద్దేశ్యంతో తాను బ్యాటింగ్ కొనసాగించినట్లు యశస్వి చెప్పాడు.