ENG vs IND : భారత భరతం పట్టాలని నిర్ణయించుకున్న ఇంగ్లాండ్.. కెప్టెన్, కోచ్ ఒకే మాట..!
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆసక్తికరంగా సాగుతోంది

ENG vs IND 3rd Test England ask for plenty of life on Lords pitch
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించగా, రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ గెలిచింది. దీంతో ప్రస్తుతానికి సిరీస్ 1-1తో సమమైంది. ఇక ఇరు జట్ల మధ్య కీలకమైన మూడో టెస్టు మ్యాచ్ జూలై 10 నుంచి 14 వరకు లండన్‌లోని లార్డ్స్ మైదానంలో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే రెండు జట్లు లండన్‌కు చేరుకున్నాయి.
ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకువెళ్లాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇరు జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సాధారణంగా లండన్‌లోని లార్డ్స్ మైదానంలోని పిచ్ పేసర్లకు స్వర్గధామంగా ఉంటుంది. ఇక్కడ పేస్, స్వింగ్‌తో బ్యాటర్లకు సవాలు తప్పదు. మూడో టెస్టులో భారత్ పై ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తున్న ఇంగ్లాండ్ జట్టు మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
మూడో టెస్టు మ్యాచ్‌కు పేసర్లకు సహకరించే మరింత జీవమున్న పిచ్‌ను ఇవ్వాలని కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ కోరినట్లుగా సమాచారం. కాగా.. గత నెలలో లార్డ్స్ వేదికగానే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో పేసర్లు పండగ చేసుకున్నారు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడిన నాటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించి డబ్ల్యూటీసీ 2025 గదను ముద్దాడింది. ఈ క్రమంలోనే పేస్ పిచ్‌తో భారత్‌ను బెంబేలెత్తించాలని ఇంగ్లాండ్ భావిస్తోంది.
అయితే.. పేస్ పిచ్ సిద్ధం చేసినా కూడా భారత్‌కు నష్టం ఏమీ ఉండదు. గతంలో అయితే పేస్ పిచ్‌ల మీద భారత జట్టు ఇబ్బంది పడేది. ఇప్పుడు భారత జట్టులోనూ జస్‌ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్‌ల రూపంలో నాణ్యమైన పేసర్లు ఉన్నారు. మమూలు పిచ్‌లపైనే చెలరేగే బుమ్రా పేస్ పిచ్‌లపై ఎలా బౌలింగ్ చేస్తాడు అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
కాగా.. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా రెండో టెస్టు మ్యాచ్‌లో బుమ్రాకు విశ్రాంతి నిచ్చారు. అతడు ఖచ్చితంగా లార్డ్స్‌లో ఆడతాడని భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండో టెస్టు మ్యాచ్ ముగిసిన వెంటనే వెల్లడించాడు. అయితే.. రెండో టెస్టులో బుమ్రా స్థానంలో ఆడిన ఆకాశ్ దీప్ 10 వికెట్లతో రాణించాడు. ఈ క్రమంలో మూడో టెస్టులో ఎవరిపై వేటు పడొచ్చు అన్నది ఆసక్తికరంగా మారింది. వికెట్లు తీయకపోవడంతో పాటు, భారీగా పరుగులు ఇస్తున్న ప్రసిద్ధ్ కృష్ణ పై వేటు పడొచ్చునని సమాచారం.