టీమిండియా ఓటమికి అసలు కారణం ఇదే.. అసలు మన వ్యూహం ఎక్కడ తప్పుతోంది?

శార్దూల్ విదేశీ పిచ్‌లపై మన జట్టుకు మ్యాచ్ విన్నింగ్ బ్యాలెన్స్ ఇవ్వలేడనేది స్పష్టమైంది.

టీమిండియా ఓటమికి అసలు కారణం ఇదే.. అసలు మన వ్యూహం ఎక్కడ తప్పుతోంది?

Shardul Thakur

Updated On : July 2, 2025 / 9:37 AM IST

దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (SENA దేశాలు) సహా పలు విదేశాల్లో టీమిండియా టెస్టు మ్యాచ్ ఓడిపోయినప్పుడల్లా ఒకే మాట వినిపిస్తుంది. “మనకు కపిల్ దేవ్ లేదా బెన్ స్టోక్స్ లాంటి ఆల్‌రౌండర్ లేడు” అని అంటుంటారు. ఇంగ్లాండ్‌తో జరిగిన హెడింగ్లే టెస్టులో ఓటమి తర్వాత కూడా ఇటువంటి చర్చే మళ్లీ మొదలైంది.

జట్టుకు బ్యాలెన్స్ ఇస్తాడని తీసుకున్న శార్దూల్ ఠాకూర్.. బ్యాటింగ్‌లో 10 పరుగులు కూడా చేయలేకపోయాడు.. బౌలింగ్‌లో అంతగా ప్రభావం చూపలేకపోయాడు. అసలు మన వ్యూహం ఎక్కడ తప్పుతోంది? బ్యాటింగ్ డెప్త్ పేరుతో మనం బౌలింగ్‌ను బలహీనం చేస్తున్నామా? గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? ఈ అంశాలపై విశ్లేషకులు ఏమంటున్నారో తెలుసా?

ప్రస్తుత పరిస్థితుల్లో శార్దూల్ నాలుగో సీమర్‌గా బౌలింగ్ చేస్తూ, చివర్లో బ్యాటింగ్‌లో పరుగులు రాబడతాడని అందరూ భావించారు. కానీ హెడింగ్లేలో అది జరగలేదు. బౌలింగ్‌లో కేవలం 16 ఓవర్లు మాత్రమే వేసి, కీలక సమయంలో వికెట్లు తీయలేకపోయాడు. బ్యాటింగ్‌లోనూ నిరాశపరిచాడు. శార్దూల్ విదేశీ పిచ్‌లపై మన జట్టుకు మ్యాచ్ విన్నింగ్ బ్యాలెన్స్ ఇవ్వలేడనేది స్పష్టమైంది.

Also Read: మళ్లీ వేలానికి రిషబ్ పంత్.. ఐపీఎల్‌లో రూ.27 కోట్లు.. ఈ సారి డీపీఎల్‌లో..?

భారత్‌కు ఇప్పుడు కావాల్సింది బ్యాటింగ్ చేసే బౌలర్ కాదు, బ్యాటింగ్ కూడా చేయగల స్పెషలిస్ట్ బౌలర్. అంటే, ఆ ఆటగాడిని కేవలం బౌలింగ్ కోసమే జట్టులోకి తీసుకోవాలి. అతని బ్యాటింగ్ అనేది ఒక బోనస్ మాత్రమే.

ఉదాహరణకు ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా), క్రిస్ వోక్స్ (ఇంగ్లండ్), కైల్ జేమీసన్ (న్యూజిలాండ్), మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) వీళ్లందరూ ప్రధాన బౌలర్లు.. కానీ, అవసరమైనప్పుడు బ్యాటింగ్‌లోనూ రాణిస్తారు. ఇలాంటి ప్రొఫైల్ ఉన్న బౌలర్ మనకు అత్యవసరం.

మన వ్యూహం ఎందుకు పనిచేయదు?
ప్రస్తుతం బుమ్రా మినహా సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి బౌలర్లు నిలకడగా రాణించడం లేదు. ఇలాంటి సమయంలో, వారి కంటే బలహీనమైన నాలుగో బౌలర్‌ను (శార్దూల్) తీసుకుంటే, 20 వికెట్లు తీయడం అసాధ్యం.

గంభీర్‌కు అసలైన అగ్నిపరీక్ష
ఈ సిరీస్‌లో కోచ్ గౌతమ్ గంభీర్ ఎలాంటి జట్టును ఎంపిక చేస్తాడన్నది అతని దూకుడు ఆలోచనా విధానాన్ని బయటపెడుతుంది. బ్యాటింగ్ డెప్త్ కోసం శార్దూల్ లేదా నితీశ్ రెడ్డి వంటి ఆటగాళ్లను ఎంచుకుంటారా? బ్యాటింగ్ డెప్త్‌ను పక్కనపెట్టి, నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగుతారా? అన్నది చూడాలి. లీడ్స్‌లో మనం 471 పరుగులు చేసి, 370 పరుగుల లక్ష్యం ఇచ్చినా ఓడిపోయామంటే, కారణం మన బౌలింగ్ వైఫల్యమే.