చరిత్ర సృష్టించిన బ్యాటర్ జో రూట్.. ఈ మైలురాయిని చేరుకున్న మొట్టమొదటి ఆటగాడిగా..
వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ చరిత్రలో రూట్ తర్వాత వరుసగా స్టీవ్ స్మిత్ (4278 పరుగులు), మార్నస్ లబుషేన్ (4225), బెన్ స్టోక్స్ (3616), ట్రావిస్ హెడ్ (3300) ఉన్నారు.

Pic-@ICC
ఇంగ్లాండ్ బ్యాటింగ్ దిగ్గజం జో రూట్ చరిత్ర సృష్టించాడు. ఇండియాతో జరుగుతున్న ఐదవ టెస్ట్‌లో నాలుగో రోజు మరోసారి అద్భుత ప్రదర్శన కనబరిచి, వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ చరిత్రలో 6,000 పరుగులు చేసిన మొట్టమొదటి ఆటగాడిగా నిలిచాడు. 25 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ మైలురాయిని చేరుకున్నాడు.
ఈ మ్యాచులో అతడు సెంచరీ కూడా బాదాడు. కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో అద్భుత షాట్లు ఆడుతూ అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకున్నాడు. ఇంగ్లాండ్ 374 పరుగుల లక్ష్య ఛేదనలో పోరాడుతున్న సమయంలో జో రూట్ ఒత్తిడి లేకుండా ఆడాడు. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో తన 69వ టెస్ట్‌లో 6,000 పరుగుల మార్కును దాటాడు. డబ్ల్యూటీసీలో అతడి ఖాతాలో ఇప్పుడు 21 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ చరిత్రలో రూట్ తర్వాత వరుసగా స్టీవ్ స్మిత్ (4278 పరుగులు), మార్నస్ లబుషేన్ (4225), బెన్ స్టోక్స్ (3616), ట్రావిస్ హెడ్ (3300) ఉన్నారు.
బ్యాటర్ | మాచ్‌లు | పరుగులు |
---|---|---|
జో రూట్ | 69* | 6000* |
స్టీవ్ స్మిత్ | 55 | 4278 |
మార్నస్ లబుషేన్ | 53 | 4225 |
బెన్ స్టోక్స్ | 57 | 3616 |
ట్రావిస్ హెడ్ | 52 | 3300 |
ఇక మొత్తం టెస్టుల చరిత్రలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చేసిన 15,921 పరుగుల రికార్డుకు జో రూట్ సమీపంగా వస్తున్నాడు. రికీ పాంటింగ్, రాహుల్ ద్రావిడ్‌ను అధిగమించి రెండవ స్థానంలోకి ఎగబాకాడు. ఇప్పటికే జో రూట్ టెస్టుల్లో 13,400 పరుగులను దాటాడు.
సెంచరీల విషయానికి వస్తే.. శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కార (38 సెంచరీలు) రికార్డును జో రూట్ దాటాడు. ఇది టెస్టుల్లో నాలుగవ అత్యధిక సెంచరీల రికార్డు. టాప్-3లో సచిన్ టెండూల్కర్ (51), జాక్వెస్ కలిస్ (45), రికీ పాంటింగ్ (41) ఉన్నారు.