IND-W vs ENG-W 1st T20 : భారత్‌కు షాక్.. తొలి టీ20లో ఇంగ్లాండ్ విజయం
India Women vs England Women 1st T20 : భారత పర్యటనలో ఇంగ్లాండ్ మహిళ జట్టు శుభారంభం చేసింది.

IND-W vs ENG-W 1st T20
భారత పర్యటనలో ఇంగ్లాండ్ మహిళ జట్టు శుభారంభం చేసింది. మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన మొదటి టీ20 మ్యాచులో 38 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 159 పరుగులకు పరిమితమైంది. భారత బ్యాటర్లలో షఫాలీ వర్మ (52; 42 బంతుల్లో 9 ఫోర్లు) అర్ధశతకం చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (26), రిచా ఘోష్ (21) లు ఓ మోస్తరుగా రాణించగా స్మృతి మంధాన (6), జెమీమా రోడ్రిగ్స్(4)లు విఫలం అయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్ మూడు వికెట్లు తీయగా నాట్ స్కివర్-బ్రంట్, ఫ్రెయా కెంప్, సారా గ్లెన్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
అంతక ముందు ఇంగ్లాండ్ మహిళ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. నాట్ స్కివర్-బ్రంట్ (77; 53 బంతుల్లో 13 ఫోర్లు), డేనియల్ వ్యాట్ (75; 47 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు చేశారు. ఆఖర్లో అమీ జోన్స్ (23; 9 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడింది. భారత బౌలర్లలో రేణుకా ఠాకూర్ సింగ్ మూడు వికెట్లు తీసింది. శ్రేయాంక పాటిల్ రెండు, సైకా ఇషాక్ ఓ వికెట్ పడగొట్టారు.
IND vs SA : దక్షిణాఫ్రికా పర్యటన ముందు టీమ్ఇండియాకు భారీ షాక్..!
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు శుభారంభం దక్కలేదు. భారత పేసర్ రేణుకా సింగ్ మొదటి ఓవర్‌లోనే సోఫియా డంక్లీ (1), అలిస్ క్యాప్సే (0) లను ఔట్ చేసింది. దీంతో ఇంగ్లాండ్ రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే.. నాట్ స్కివర్-బ్రంట్, డేనియల్ వ్యాట్ లు ఇద్దరూ ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నారు. ఆరంభంలో ఆడితూచి ఆడిన ఈ జోడి క్రమంగా వేగం పెంచింది.
భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో 34 బంతుల్లో డేనియల్ వ్యాట్, 36 బంతుల్లో నాట్ స్కివర్ లు అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. ఆ తరువాత వీరిద్దరు మరింత ధాటిగా బ్యాటింగ్ చేశారు. డేనియల్ వ్యాట్‌ను ఔట్ చేయడం ద్వారా సైకా ఇషాక్ ఈ జోడిని విడగొట్టింది. స్కివర్-వ్యాట్ జోడి మూడో వికెట్‌కు 138 పరుగులు జోడించారు. హీథర్ నైట్ (6) విఫలం అయినా ఆఖర్లో మీ జోన్స్ వేగంగా ఆడడంతో ఇంగ్లాండ్ స్కోరు 190 పరుగులు దాటింది.