బీసీసీఐ ప్రెసిడెంట్‌గా గంగూలీ

బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఎంపిక దాదాపు ఖాయమైనట్లే. అక్టోబరు 23న బీసీసీఐ వార్షిక సమావేశంలో జరిగే ఎన్నికల్లో ఫలితాలు తేలనున్నాయి. గంగూలీతో పాటు సెక్రటరీగా అమిత్ షా కొడుకు జై షా వ్యవహరించనున్నారు. వీరితో పాటు కోశాధికారిగా అరుణ్ ధుమాల్ ఎంపిక కానున్నట్లు సమాచారం. 

అరుణ్ ధుమాల్ కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌‌కు సోదరుడు. ఎన్నికల్లో తేలాల్సిన పదవుల్ని పోటీ లేకుండానే దక్కించుకోవాలని క్రికెట్ వర్గాలు, రాజకీయ శ్రేణులు నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు సుదీర్ఘ చర్చలు ఏర్పాటు చేసుకుని పదవులు కేటాయించుకోనున్నారు. 

శనివారం అమిత్‌ షాను గంగూలీ ఢిల్లీలో కలవడంతోనే బోర్డు అధ్యక్షుడి పదవి ఖాయమైనట్లు తెలుస్తోంది. నిజానికి 2021 బెంగాల్‌ శాసనసభ ఎన్నికల్లో తనకు మద్దతునివ్వాలని షా కోరినప్పటకీ గంగూలీ హామీ ఇవ్వలేదని తెలిసింది. ఈ క్రమంలో బ్రిజేష్‌ పటేల్‌ పేరు అధ్యక్షుడిగా తెరపైకి వచ్చింది. పలువురి నుంచి బ్రిజేష్ అభ్యర్థిత్వంపై వ్యతిరేకత వ్యక్తం కావడంతో గంగూలీకి మార్గం సుగమమైంది.