గోల్ కీపర్‌కు పిచ్చెక్కించారు: కాళ్లతో ఓ సారి.. తలతో మరోసారి

గంటల సమయం వెచ్చించి పోరాడినా.. మైదానమంతా కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్లు తిరిగినా మ్యాచ్ మొత్తంలో ఒక్క గోల్ కూడా చేయలేని సందర్భాలు ఫుట్‌బాల్‌లో కోకొల్లలు. ఎంతకష్టపడినా గోల్ కీపర్‌లు కాపు కాసి కూర్చుంటారు. ప్లేయర్లను తప్పించినా వారి నుంచి బంతిని గోల్ చేయాలంటే కొంచెం కష్టంతో కూడుకున్న పనే. కానీ, తాజాగా యూఈఎఫ్ఏ చాంపియన్ లీగ్‌లో ఓ విచిత్రమైన గోల్ నమోదైంది. 

ఆమ్‌స్టర్‌డమ్ వేదికగా అజాక్స్, రియల్ మాడ్రిడ్ జట్లు హోరాహోరీగా పోరాడాయి. గోల్ చేసేందుకు తీవ్రంగా శ్రమించిన అజాక్స్ అనూహ్యంగా 87వ నిమిషంలో గోల్ చేసి 2-1 ఆధిక్యంతో మ్యాచ్‌ను ముగించింది. రియల్ మాడ్రిడ్ గోల్ కీపర్‌ను తికమకపెట్టారు అజాక్స్ ప్లేయర్లు. పెనాల్టీ కార్నర్‌ను చక్కగా వినియోగించుకున్న అజాక్స్ బంతిని అదుపుచేస్తూ గోల్ పాయింట్ దిశగా బంతిని బాదింది. దానిని చురుగ్గా అడ్డుకున్న కీపర్.. తిప్పి కొట్టాడు. అదే సమయంలో క్షణాల్లో అద్భుతం జరిగిపోయింది. వెంటనే వెనక్కి వచ్చిన బంతిని అజాక్స్ ప్లేయర్ తలతో ఢీ కొట్టాడు. సరాసరి నెట్‌లో పడటంతో ఆ జట్టుకు గెలుపు ఖాయమైపోయింది. 

ఆ గోల్‌పై అంతటా అనుమానం వ్యక్తం చేసిన రియల్ మాడ్రిడ్ రివ్యూ కోరింది. రివ్యూలోనూ ఫౌల్ లేకుండా గోల్ చేశారని రావడంతో ఓటమిని అంగీకరించకతప్పలేదు. ఇదే లీగ్‌లో తర్వాతి మ్యాచ్‌ను పర్యాటక జట్టు రియల్ మాడ్రిడ్ మార్చి 5న శాంటియో బెర్నాబ్యూ వేదికగా ఆడనుంది.