Handshake Row ICC rejects Pak board demand to drop Asia Cup match
Asia Cup 2025 : ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం భారత్,పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ సందర్భంగా, మ్యాచ్ ముగిసిన తరువాత భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో కరచాలనం చేయలేదు. పహల్గాం ఉగ్రదాడి బాధిత కటుంబాలకు సంఘీభావం తెలపడమే తమ ఉద్దేశ్యం అని, తమ చర్యను భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సమర్థించుకున్న సంగతి తెలిసిందే.
అయితే.. టాస్ సందర్భంగా భారత కెప్టెన్‌తో కరచాలనం చేయొద్దని పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాతో రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ చెప్పినట్లు పీసీబీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలోనే రిఫరీ నిబంధనలను ఉల్లంఘనలకు కారణమయ్యారంటూ ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు చేసింది. వెంటనే అతడిని మిగిలిన మ్యాచ్ ల్లో బాధ్యతల నుంచి తప్పించాలని కోరింది.
Pathum Nissanka : అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో పాతుమ్ నిస్సాంక అరుదైన ఘనత.. ఒకే ఒక లంక ఆటగాడు..
ఈ విషయాన్ని పీసీబీ ఛైర్మన్ మోహ్‌సిన్ నఖ్వీ కూడా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ‘మ్యాచ్ రిఫరీ ఐసీసీ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారు. దీనిపై ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు చేసింది. ఆసియాకప్‌లో మ్యాచ్ రిఫరీగా ఉన్న అతడిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశాం.’ అని చెప్పాడు.
కాగా.. ఈ విషయంపై దర్యాప్తు చేసిన తర్వాత ఐసిసి ఇందులో మ్యాచ్ రిఫరీ ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని పీసీబీకి తెలియజేసింది. ఇద్దరు కెప్టెన్ల మధ్య కరచాలనం ఉండదు అనే విషయం పీసీబీ డైరెక్టర్‌తో పాటు కొంత మంది ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధికారులకు ముందుగానే తెలుసునని పీసీబీకి ఐసీసీ చెప్పినట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
ఇదిలా ఉంటే.. ఐసీసీ తమ డిమాండ్‌ను తిరస్కరిస్తే ఆసియాకప్ (Asia Cup 2025)టోర్నీ నుంచి పాక్ వైదొలుగుతుందని వార్తలు వచ్చాయి. అయితే.. ఈ విషయమై ఇప్పటి వరకు పాక్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారమే బుధవారం యూఏఈతో మ్యాచ్‌లో పాక్ తలపడనున్నట్లు సమాచారం.
ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు సూపర్4కి అర్హత సాధిస్తుంది. ఇప్పటికే గ్రూపు-ఏ నుంచి భారత్ సూపర్4కి అర్హత సాధించిన సంగతి తెలిసిందే.