భారత జట్టులో చాన్నాళ్లుగా హార్దిక్ పాండ్యా కీలకంగా మారిపోయాడని టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ అభిప్రాయపడ్డాడు. గతంలో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి చెప్పిన విధంగానే పాండ్యాకు మద్ధతుగా నిలిచాడు ధావన్.
భారత జట్టులో చాన్నాళ్లుగా హార్దిక్ పాండ్యా కీలకంగా మారిపోయాడని టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ అభిప్రాయపడ్డాడు. గతంలో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి చెప్పిన విధంగానే పాండ్యాకు మద్ధతుగా నిలిచాడు ధావన్. ఇటీవల ‘కాఫీ విత్ కరణ్’ అనే టీవీ కార్యక్రమంలో పాల్గొన్న పాండ్యా, రాహుల్‌లు మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి రెండు మ్యాచ్‌ల సస్పెన్షన్‌కు గురైయ్యారు. ఈ క్రమంలో పాండ్యా జట్టులో ఉండుంటే బాగుండేదని శిఖర్ తెలిపాడు. శుక్రవారం నుంచి ఆస్ట్రేలియాతో భారత్ మూడో వన్డే ఆడనుంది. మ్యాచ్‌కు ఒక రోజు ముందు జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న ధావన్ మీడియాతో మాట్లాడుతూ జట్టులో పాండ్యా ప్రాముఖ్యాన్ని విశ్లేషించాడు.
కొన్నాళ్లుగా టీమిండియా సమతుల్యత రావడానికి హార్దిక్ చాలా కృషి చేశాడు. పాండ్యా జట్టులోకి వచ్చిన తర్వాత అది సాధ్యపడింది. జట్టులో చేరినప్పటి నుంచి కీలక సభ్యుడిగా మారిపోయాడు’ అని వ్యాఖ్యానించాడు. పనిలోపనిగా పేసర్లు మొహ్మద్ సిరాజ్, ఖలీల్ అహ్మద్‌లను వెనకేసుకొచ్చాడు ధావన్. వాళ్లింకా నేర్చుకునే దశలో ఉన్నారని క్రమంగా పరిణతి సాధిస్తారనే నమ్మకాన్ని వెలిబుచ్చాడు. ప్రస్తుతం తమ బౌలింగ్ యూనిట్‌కు సంబంధించి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు.
ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా అద్భుతమైన విజయం సాధించింది. తొలి వన్డేలో 34 పరుగుల తేడాతో ఓడిపోయిన టీమిండియా రెండో వన్డేలో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. జనవరి 18న నిర్ణయాత్మక వన్డేను ఇరు జట్లు మెల్‌బోర్న్ వేదికగా ఆడనున్నాయి.