Harmanpreet Kaur : థాయ్‌లాండ్ పై ఘన విజయం.. టీమ్ఇండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అసంతృప్తి..
మహిళల ఆసియాకప్ 2026లో శుభారంభం చేయడం పట్ల టీమ్ఇండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) ఆనందాన్ని వ్యక్తం చేసింది.
Harmanpreet Kaur key comments after india beat Thailand in Womens asia cup 2026
Harmanpreet Kaur : మహిళల ఆసియా కప్ 2026లో భారత్ శుభారంభం చేసింది. ఆదివారం దుబాయ్ వేదికగా థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమ్ఇండియా గెలుపొందినప్పటికి కూడా బ్యాటర్ల షాట్ల ఎంపికపై భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అసంతృప్తి వ్యక్తం చేసింది.
షెఫాలీ వర్మ (64; 36 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ప్రతీకా రావల్ (22), స్మృతి మంధాన (19) పర్వాలేదనిపించారు. థాయ్‌లాండ్ బౌలర్లలో సులీపోర్న్ లావోమి మూడు, సునిదా చతురోంగ్-రత్తన రెండు, తిప్చా పుట్టావోంగ్, చనిద సుత్తిరుయాంగ్ చెరో వికెట్ సాధించారు.
అనంతరం 160 పరుగుల లక్ష్య ఛేదనలో థాయ్‌లాండ్ జట్టు 16.1 ఓవర్లలో 65 పరుగులకే కుప్పకూలింది. థాయ్ లాండ్ బ్యాటర్లలో ననపత్ (41; 48 బంతుల్లో 5 ఫోర్లు) టాప్‌స్కోరర్. భారత బౌలర్లలో నందని, దీప్తి శర్మ చెరో మూడు వికెట్లు తీశారు. శ్రీచరణి రెండు వికెట్లు పడగొట్టింది. క్రాంతి గౌడ్ ఓ వికెట్ సాధించింది.
ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం పట్ల భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఆనందాన్ని వ్యక్తం చేసింది. ‘మొత్తం ప్రదర్శనతో ఖచ్చితంగా సంతోషంగా ఉన్నాం. బ్యాటింగ్‌తో మంచి ఆరంభం లభించింది. అయితే బంతి బ్యాట్‌పైకి సరిగ్గా రాలేదు. ఆగుతూ వచ్చింది. ఆ సమయంలో బ్యాటర్లు సరైన షాట్లు ఆడలేకపోయారు. మొత్తంగా చూస్తే ఇది మంచి మ్యాచ్.’ అని హర్మన్ అంది.
ఓ దశలో మూడు వికెట్ల నష్టానికి 108 పరుగులతో భారీ స్కోరు దిశగా వెలుతున్న జట్టు ఆకస్మాత్తుగా వికెట్లు కోల్పోయింది. 137 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది. ఇలా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలడంపై మాట్లాడుతూ.. ‘ఈ పిచ్ పై కొత్త బంతితో బ్యాటింగ్ చేయడం సులభంగా అనిపించింది. కానీ ఆ తర్వాత బంతి కొంత ఆగుతూ వచ్చింది. మా బ్యాటర్లంతా మంచి షాట్లు ఆడలేకపోయాం. అదే సమయంలో థాయ్‌లాండ్ బౌలర్లకు కూడా క్రెడిట్ ఇవ్వాలి. వారు షాట్ల ఆడలేని విధంగా బౌలింగ్ చేశారు.’ అని హర్మన్ తెలిపింది.
ఇక భారత విజయంలో కీలక పాత్ర పోషించిన షఫాలీ వర్మ, దీప్తి శర్మపై ప్రశంసల జల్లు కురిపించింది. షఫాలీ ఫామ్ అందుకోవడం, జట్టు కోసం కీలక పరుగులు చేయడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని చెప్పింది. ఇక దీప్తికి చాలా అనుభవం ఉందని, ఈ రోజు కూడా ఆమె తన అనుభవాన్ని ఉపయోగించి బాగా రాణించిందని తెలిపింది. ఈ టోర్నీలో ఇతర జట్ల ప్రదర్శనపై హర్మన్‌ప్రీత్ మాట్లాడుతూ.. ఆసియా కప్‌లో అన్ని జట్లు చాలా చక్కగా ఆడుతున్నాయని అంది. ఏ జట్టును తక్కువ అంచనా వేయకూడదని తెలిపింది.
