Harry Brook : నైట్ క్లబ్ వద్ద గొడవ.. క్షమాపణలు చెప్పినా కెప్టెన్‌కు భారీ జరిమానా విధించిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు..
వన్డే, టీ20 కెప్టెన్ హ్యారీ బ్రూక్‌కు (Harry Brook) ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు భారీ జరిమానా విధించింది.
Harry Brook apologises after nightclub incident in New Zealand
- న్యూజిలాండ టూర్‌లో నైట్ క్లబ్ వద్ద హ్యారీ బ్రూక్ గొడవ
- ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సిరీయస్
- వార్నింగ్ తో పాటు భారీ ఫైన్
Harry Brook : వన్డే, టీ20 కెప్టెన్ హ్యారీ బ్రూక్‌కు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదండోయ్ అతడికి దాదాపు 30 వేల పౌండ్లు జరిమానాగా విధించింది. అంటే భారత కరెన్సీలో దాదాపు 36 లక్షల రూపాయలు. ఇక తాను చేసింది తప్పేనని, క్షమించాలని, మరోసారి ఇలాంటిది జరగని బ్రూక్ ఈసీబీకి హామీ ఇచ్చాడు.
అసలేం జరిగిందంటే?
యాషెస్ సిరీస్ కన్నా ముందు ఇంగ్లాండ్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటించింది. గతేడాది నవంబర్ 1న న్యూజిలాండ్‌తో మూడో వన్డే మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి హ్యారీ బ్రూక్ మద్యం మత్తులో ఓ నైట్‌క్లబ్ వద్ద గొడవ పడ్డాడు. ఈ ఘటన చాలా ఆలస్యంగా యాషెస్ సిరీస్ ముగిసిన తరువాత వెలుగులోకి వచ్చింది.
సహచర ఆటగాళ్లు జాకెబ్ బెథెల్, గస్ అట్కిన్సన్‌తో కలిసి బ్రూక్ వెల్లింగ్టన్‌లోని ఓ నైట్ క్లబ్ వద్దకు వెళ్లాడు. అయితే.. బ్రూక్ తాగి ఉన్నాడని అనుమానించిన బౌన్సర్ అతడిని లోనికి అనుమతించలేదు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో బ్రూక్ పై బౌన్సర్ చేయి చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
దీనిపై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు విచారణ చేపట్టింది. బ్రూక్‌ను వివరణ కోరింది. విచారణ అనంతరం బ్రూక్‌కు ఫైనల్ వార్నింగ్ ఇచ్చి, 30 వేల పౌండ్లు జరిమానాగా విధించింది.
WPL 2026 : శుక్రవారం నుంచే డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్.. మ్యాచ్‌లను ఎక్కడ చూడొచ్చొ తెలుసా?
ఇక ఈ ఘటన పై హ్యారీ బ్రూక్ తాజాగా స్పందించాడు. తన చర్యల పట్ల క్షమాపణలు తెలిపాడు. తన ప్రవర్తన వల్ల తనకు, జట్టుకు ఇబ్బంది కలిగిందన్నాడు. ఇంగ్లాండ్ కు ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చాడు. జరిగిన ఘటనను తీవ్రంగా పరిగణిస్తాను. కోచ్‌లు, సహచర ఆటగాళ్లను నిరాశపరిచనందుకు చింతిస్తున్నాను అంటూ బ్రూక్ తెలిపాడు.
ఈ తప్పు నుంచి చాలా నేర్చుకున్నానని, ఇకపై మైదానంలో, వెలుపల తన చర్యల ద్వారా నమ్మకాన్ని తిరిగి నిర్మించుకోవాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. మరోసారి ఇలాంటి తప్పును పునరావృతవం కాకుండా చూసుకుంటానని అన్నాడు.
ఇక యాషెస్ సిరీస్‌లో బ్రూక్ 10 ఇన్నింగ్స్‌ల్లో 358 పరుగులు మాత్రమే చేశాడు. ఒక్క సెంచరీ కూడా చేయలేదు.
