అయ్యో ఆర్సీబీ..! ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతైనట్లేనా? ఇంకా అవకాశముందా..

ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా ఆదివారం ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు ఒక్కపరుగు తేడాతో ఓటమి పాలైంది.

RCB Team

IPL 2024 RCB : ఐపీఎల్ 2024 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు విఫలమైంది. పేరున్న బ్యాటర్లు, బౌలర్లు జట్టులో ఉన్నప్పటికీ.. అభిమానులు ఆశించిన స్థాయిలో ఆ జట్టు ప్లేయర్లు రాణించలేక పోయారు. ఫలితంగా ఈ సీజన్ లో ఎనిమిది మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీ జట్టు కేవలం ఒక్క మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించింది.. ఏడు మ్యాచ్ లలో ఓటమి పాలైంది. సీజన్ ప్రారంభంలో ఆర్సీబీ జట్టుపై ఎన్నో ఆశలు ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో ఒక్కసారిగాకూడా ఆర్సీబీ జట్టు ట్రోపీని గెలుచుకోలేక పోయింది. అయితే, ఈసారి కచ్చితంగా ఆర్సీబీ జట్టు ఫైనల్ కు చేరి విజయం సాధిస్తుందని ఆ జట్టు అభిమానులు ధీమాను వ్యక్తం చేశారు. కానీ, అభిమానుల అంచనాలను విఫలం చేస్తూ ఆర్సీబీ జట్టు ఫ్లెఆఫ్స్ అవకాశాలను దూరం చేసుకుంది.

Also Read : విరాట్ కోహ్లీ వివాదాస్పద ఔట్ పై నవజ్యోత్ సిద్ధూ కీలక వ్యాఖ్యలు.. వీడియో వైరల్

ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా ఆదివారం ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు ఒక్కపరుగు తేడాతో ఓటమి పాలైంది. ఈ సీజన్ లో పాయింట్ల పట్టికలో కేవలం రెండు పాయింట్లతో చివరి స్థానంలో ఆర్సీబీ నిలిచింది. సాధారణంగా లీగ్ లో 16 పాయింట్లు (ఎనిమిది మ్యాచ్ ల విజయాలు) సాధించిన జట్లకు ప్లేఆఫ్స్ చేరేందుకు అవకాశం ఉంటుంది. ఒక్కోసారి 14 పాయింట్లతోనూ మొదటి స్థానంలో నిలవొచ్చు. ఒక్కో జట్టు మొత్తం 14 మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది. ఆర్సీబీ వరుసగా వచ్చే ఆరు మ్యాచ్ లలో విజయం సాధించినా ఆ జట్టు కేవలం 14 పాయింట్లకే చేరుతుంది.

IPL 2024 : నో బాల్ విషయంలో అంపైర్‌తో కోహ్లీ గొడవ.. మ్యాచ్ తరువాత ఏం జరిగిందంటే..? వీడియో వైరల్

ఆర్సీబీ జట్టుకు అదృష్టం కలిసొచ్చి.. మిగతా ఆరు మ్యాచ్ లలో విజయం సాధించి, టాప్ -4లో నిలిచే జట్లలోకి వెళ్తే. అదీకూడా.. టాప్ -4కు చేరిన మిగిలిన టీంలు ఆర్సీబీ రన్ రేట్ కంటే వెనుకబడి ఉంటే ప్లేఆఫ్స్ కు చేరే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం ఆర్సీబీ రన్ రేట్ -1.046. రన్ రేట్ మెరుగుపర్చుకోవాలంటే.. ఆర్సీబీ ఆడబోయే అన్ని మ్యాచ్ లలోనూ భారీ విజయాలు సాధించాలి. ఇలా జరగడం దాదాపు అసాధ్యమే. ఇప్పటికే రాజస్థాన్ జట్టు 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉ:ది. కోల్ కతా (10), సన్ రైజర్స్ (10), చెన్నై (8), లక్నో (8), గుజరాత్ (8) ప్లేఆఫ్స్ రేసులో ఉన్నాయి. ఈ జట్ల పాయింట్లను పరిగణలోకి తీసుకుంటే.. ఏదైనా ఊహించని అద్భుతం జరిగితే తప్ప.. ఆర్సీబీ జట్టు ప్లేఆఫ్స్ వెళ్లడం దాదాపు అసాధ్యమనే చెప్పొచ్చు.

ఐపీఎల్ 2018 నుంచి 2021 వరకు నాల్గో స్థానంలో నిలిచిన జట్టు 14 పాయింట్లను కలిగి ఉంది. ప్లే ఆఫ్ కు అర్హత సాధించింది. 2019లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కేవలం 12 పాయింట్లతో ప్లేఆఫ్స్ కు అర్హత సాధించింది. 2022 నుంచి రెండు కొత్త జట్టు ఐపీఎల్ లో చేరాయి. దీంతో రెండు జట్ల ప్రభావంతో ప్లేఆఫ్స్ చేరే జట్టుకు తక్కువలో తక్కువ 16 పాయింట్లు అవసరం ఉంటుంది. ఆ లెక్కన అంచనా వేస్తే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు చేరే అవకాశమే లేదని చెప్పొచ్చు.