Antim Panghal: ఆమెను పంపిస్తున్నారేంటీ?.. మేము ఇక రెజ్లింగ్‌ను వదిలేయాలా?: ఛాంపియన్‌ అంతిమ్‌ వీడియో

అక్కడ పతకం సాధిస్తే ఒలింపిక్స్‌కు వెళ్తామని తెలిపింది. దాని కోసమే కఠోర శిక్షణ తీసుకుంటున్నామని చెప్పింది.

Antim Panghal: ఆమెను పంపిస్తున్నారేంటీ?.. మేము ఇక రెజ్లింగ్‌ను వదిలేయాలా?: ఛాంపియన్‌ అంతిమ్‌ వీడియో

Antim Panghal

Wrestlers – Antim Panghal: ట్రయల్స్‌లో పాల్గొనకపోయినప్పటికీ రెజ్లర్లు భజరంగ్ పునియా( Bajrang Punia), వినేశ్ ఫొగట్ (Vinesh Phogat) ఆసియన్స్ గేమ్స్ లో పాల్గొనే అవకాశం దక్కించుకోవడంపై అండర్‌-20 ప్రపంచ ఛాంపియన్‌ అంతిమ్‌ పంఘాల్‌ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh) లైంగిక వేధింపులపై పోరాటం చేసిన నేపథ్యంలో భజరంగ్ పునియా, వినేశ్ ఫొగట్ ట్రయల్స్ కు దూరమైన విషయం తెలిసిందే.

దీంతో ట్రయల్స్ నుంచి వారిద్దరికీ మినహాయింపు ఇస్తూ ఆసియన్ గేమ్స్ లో పాల్గొనేందుకు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అడ్ హక్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆసియా గేమ్స్ ఈ ఏడాది సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 8 వరకు చైనాలో జరగనున్నాయి.

భజరంగ్ పునియా, వినేశ్ ఫొగట్ కు అవకాశం ఇవ్వడం పట్ల అంతిమ్‌ పంఘాల్‌ ఓ వీడియో రూపంలో మాట్లాడుతూ… కఠోర సాధన చేసి, పతకాలు గెలుస్తున్న తమకు కాదని వినేశ్ ఫొగట్‌ను పంపితే తాము ఇక రెజ్లింగ్‌ను వదిలేయాలా అని ప్రశ్నించింది.

వినేశ్ ఫొగట్ ను నేరుగా ఆసియన్ గేమ్స్‌కు పంపుతున్నారని చెప్పింది. ఏడాదిగా ఆమె సాధించినది ఏమీ లేదని తెలిపింది. అయినప్పటికీ ఆమెను నేరుగా పంపుతుండడం ఏంటని నిలదీసింది. కామన్వెల్త్ గేమ్స్ లోనూ ఇలాగే చేశారని, అప్పుడు కూడా తనను మోసం చేశారని పేర్కొంది. ట్రయల్స్ ను పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేసింది.

గత ఏడాది తాను జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ సాధించానని, గోల్డ్ మెడల్ సాధించి భారత్ నుంచి ఆ ఘనత సాధించిన తొలి మహిళా రెజ్లర్ గా నిలిచానని తెలిపింది. 2023 ఆసియన్ ఛాంపియన్‌షిప్ లోనూ సిల్వర్ మెడల్ సాధించానని చెప్పింది. ఏడాదిగా వినేశ్ ఫొగట్ ఏమీ సాధించలేదని, అంతేగాక ఆమెకు గాయమైందని తెలిపింది.

ఆసియా గేమ్స్‌ లో పాల్గొన్న వారు వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ అర్హత సాధిస్తారని చెప్పింది. అక్కడ పతకం సాధిస్తే ఒలింపిక్స్‌కు వెళ్తామని తెలిపింది. దాని కోసమే కఠోర శిక్షణ తీసుకుంటున్నామని చెప్పింది. ట్రయల్స్ లేకుండా వినేశ్‌ ఫొగట్ ను ఇలా నేరుగా ఆసియన్ గేమ్స్ కు పంపితే ఇక తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. తాము రెజ్లింగ్‌ను వదిలేయాలా అని నిలదీసింది.

SL Vs PAK 1st Test : బంతితో బ్యాట‌ర్ ప‌రుగు.. ర‌నౌట్ చేసేందుకు వెంట‌ప‌డిన కీప‌ర్‌.. నవ్వులే న‌వ్వులు.. వీడియో