ICC Bans Transgender : అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్ ప్లేయర్స్ పై ఐసీసీ నిషేధం.. ఎందుకంటే?

ఐసీసీ తాజా నిర్ణయం కేవలం అంతర్జాతీయ స్థాయి క్రికెట్ కే వర్తిస్తుంది. దేశీయ స్థాయిలో లింగ అర్హత అనేది ఆయా బోర్డులకు సంబంధించిన అంశం.

ICC Bans Transgender : అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్ ప్లేయర్స్ పై ఐసీసీ నిషేధం.. ఎందుకంటే?

ICC Bans Transgender

Updated On : November 22, 2023 / 9:50 AM IST

Transgender Players Banned : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ మహిళా క్రికెట్  స్థాయిలో ట్రాన్స్‌జెండర్ (లింగమార్పిడి ద్వారా స్త్రీలుగా మారిన వారు) క్రికెటర్లను నిషేధించింది. మహిళల క్రికెట్ న్యాయబద్దతను కాపాడేందుకు, ప్లేయర్ల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ తెలిపింది. అయితే, ఈ అంశంపై గత తొమ్మిది నెలలుగా ఐసీసీ విస్తృత సంప్రదింపులు జరిపింది. చివరికి అంతర్జాతీయ స్థాయి క్రికెట్ లో ట్రాన్స్‌జెండర్ క్రికెటర్లపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.

Also Read : ICC Stop Clock Rule : వన్డే, టీ20ల్లో కొత్త ‘స్టాప్ క్లాక్’ రూల్.. 60 సెకన్ల పరిమితి దాటితే 5 పరుగుల పెనాల్టీ!

ఐసీసీ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటన్న ప్రశ్నకు అధికారి సమాధానం ఇచ్చారు. క్రికెట్ ఒలింపిక్ క్రీడ కాబోతోంది. లింగ మార్పిడి చేసుకున్న వాళ్లు మహిళల క్రీడల్లో పాల్గొనడం అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చనీయాంశం. దీనిపై తమ ఆటలకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాలని అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) క్రీడా సమాఖ్యలకు సూచించిందని చెప్పాడు. ఇదిలాఉంటే బ్రెజిల్ తో జరిగిన మహిళల టీ20 మ్యాచ్ లో కెనడాకు చెందిన డేనియల్ మెక్ గాహే అధికారిక అంతర్జాతీయ మ్యాచ్ లో పాల్గొన్న మొదటి ట్రాన్స్ జెండర్ క్రికెటర్ గా నిలిచారు. అయితే, ఆమె అంతర్జాతీయ క్రికెట్ లో చోటు దక్కించుకున్న రెండు నెలల తరువాత ఈ నిర్ణయం వచ్చింది. తాజాగా ఐసీసీ నిర్ణయంతో ఆమె ఇకపై మహిళల అంతర్జాతీయ క్రికెట్ లో పాల్గొనలేరు.

Also Read : Vijayashanti : వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ జట్టు ఓటమిపై విజయశాంతి ట్వీట్ వైరల్

ఐసీసీ తాజా నిర్ణయం కేవలం అంతర్జాతీయ స్థాయి క్రికెట్ కే వర్తిస్తుంది. దేశీయ స్థాయిలో లింగ అర్హత అనేది ఆయా బోర్డులకు సంబంధించిన అంశం. ఇది స్థానిక చట్టం ద్వారా అమలు పర్చుకొనేందుకు అవకాశం ఉంటుందని ఐసీసీ తెలిపింది. ఇప్పటికే స్విమ్మింగ్, సైక్లింగ్; అథ్లెటిక్స్, రగ్బీ లీగ్, రగ్బీ యూనియన్ వంటి ఇతర క్రీడల్లో అంతర్జాతీయ స్థాయి మహిళల పోటీల్లో పాల్గొనకుండా ట్రాన్స్ జెండర్ అథ్లెట్లు నిషేధించబడ్డారు.