జాతి వివక్ష వ్యాఖ్యలు: పాక్ కెప్టెన్‌పై ఐసీసీ వేటు

దక్షిణాఫ్రికా వేదికగా ఆడుతున్న మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ నోరు జారి 4 మ్యాచ్‌ల నిషేదాన్ని కొనితెచ్చుకున్నాడు. మ్యాచ్ గెలవాలనే ఆరాటంతో స్లెడ్జింగ్‌కు పాల్పడిన సర్ఫరాజ్ హద్దు మీరి ప్రవర్తించాడు. అవి కాస్తా ఐసీసీ దృష్టికి వెళ్లడంతో నిషేదం తప్పని సరైంది. దక్షిణాఫ్రికా క్రికెటర్ అండిలె ఫెలుక్వాయోపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడంతో అతడిని నాలుగు మ్యాచ్‌లు నిషేధించింది.
ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో సర్ఫరాజ్ ఆడడు. ఫిబ్రవరి 1 నుంచి ఆరంభమయ్యే టీ20 సిరీస్‌లోనూ రెండు మ్యాచ్‌లు ఆడలేడు. ఈ నాలుగు మ్యాచుల్లో సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఆ జట్టుకు కెప్టెన్సీ వహించనున్నాడు. ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోంది.
డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో మంగళవారం జరిగిన వన్డేలో జాతి వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేశాడు. ‘ఏయ్ నల్లోడా..! ఈ రోజు మీ అమ్మ ఎక్కడ కూర్చుంది? నీ గురించి ఏమని ప్రార్థించమని ఆమెను ఈ రోజు కోరావు’ అని సర్ఫరాజ్ అన్నాడు. ఇన్నింగ్స్ 37వ ఓవర్లో సర్ఫరాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు స్టంప్ మైక్‌లో స్పష్టంగా రికార్డయ్యాయి. విచారణ చేపట్టిన ఐసీసీ ‘సర్ఫరాజ్ ఉద్దేశపూర్వకంగానే దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ అండిలె ఫెలుక్వాయోపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడు. దాంతో అతడు ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించినట్టైంది’ అని తెలిపింది.