I'm hurt because we lost the Test Rohit Sharma comments after pune test defeat
మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ కోల్పోయింది. పూణే వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ 113 పరుగుల తేడాతో భారత్ పై విజయం సాధించింది. ఈ విజయంలో మూడు మ్యాచుల సిరీస్‌లో కివీస్ ప్రస్తుతం 2-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. 359 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 245 పరుగులకే కుప్పకూలింది.
టీమ్ఇండియా బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (77) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. మిగిలిన వారిలో జడేజా (42) ఫర్వాలేదనిపించాడు. రోహిత్ శర్మ(8), విరాట్ కోహ్లీ (17), రిషబ్ పంత్ (0), సర్ఫరాజ్ ఖాన్ (9)లు విఫలం అయ్యారు. కివీస్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్ ఆరు వికెట్లు తీశాడు. అజాజ్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టాడు. గ్లెన్ ఫిలిప్స్ ఓ వికెట్ సాధించాడు.
ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే కుప్పకూలింది. దీంతో కివీస్ కు 103 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ 255 పరుగులు చేసింది. దీంతో భారత్ ముందు 359 పరుగుల లక్ష్యం నిలవగా 245 పరుగులకే భారత్ ఆలౌటైంది.
ఇక ఈ మ్యాచ్‌లో ఓటమిపై టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఓటమి తమని నిరాశపరిచిందని చెప్పాడు. తాను బ్యాటర్లు లేదా బౌలర్లను తప్పు పట్టే వ్యక్తిని కాదన్నాడు. సమిష్టి వైఫల్యం కారణంగానే ఓడిపోయినట్లు చెప్పుకొచ్చాడు. “ఈ ఓటమి నిరాశపరిచింది. ఇది మనం ఊహించినది కాదు. న్యూజిలాండ్‌కు క్రెడిట్ ఇవ్వాలి. వారు మా కంటే బాగా ఆడారు. మేము కొన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలం అయ్యాం.
గెలవాలంటే 20 వికెట్లు తీయాలి. అదే సమయంలో స్కోరు బోర్డుపై పరుగులు ఉంచడం కూడా ముఖ్యమే. కివీస్‌ను రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 260 పరుగుల లోపే కట్టడి చేశాం. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్ కివీస్ 200/3 తో ఉన్నప్పుడు భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. 259 పరుగులకే ఆలౌట్ చేశారు.
మా ఓటమికి పిచ్ కారణం కాదు. తొలి ఇన్నింగ్స్‌ల్లో మేము ఇంకా కాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. బ్యాటర్లను లేదా బౌలర్లను తప్పుపట్టే వ్యక్తిని కాదు. ఇది సమిష్టి వైఫల్యం. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటాం. వాంఖడే వేదికగా జరగనున్న మూడో టెస్టులో తప్పులను సరిదిద్దుకుని మెరుగైన ప్రదర్శన చేస్తామనే నమ్మకంతో ఉన్నాం.” అని రోహిత్ శర్మ అన్నాడు. సిరీస్ క్లీన్‌స్వీప్ కాకుండా ముంబైలో గెలుస్తామని చెప్పాడు.