IND vs NZ : రెండో టెస్టులో భారత్ ఓటమి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకున్న న్యూజిలాండ్
పూణే టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధించింది.

India vs New Zealand
IND vs NZ : పూణే టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధించింది. 359 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 245 పరుగులకే ఆలౌటైంది. దీంతో న్యూజిలాండ్ 113 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంలో మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య నామ మాత్రమైన మూడో టెస్టు మ్యాచ్ ముంబైలోని వాంఖడే వేదికగా నవంబర్ 1 నుంచి 5 వరకు జరగనుంది.
359 పరుగుల భారీ లక్ష్యంతో భారత్ బరిలోకి దిగింది. అయితే.. బ్యాటర్లు విఫలం కావడంతో 60.2 ఓవర్లలో 245 పరుగులకే కుప్పకూలింది. భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (77; 65 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. రవీంద్ర జడేజా (42) ఫర్వాలేదనిపించాడు. రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లీ (17), రిషబ్ పంత్ (0), సర్ఫరాజ్ ఖాన్ (9)లు విఫలం అయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్ ఆరు వికెట్లు తీశాడు. అజాజ్ పటేట్ రెండు వికెట్లు, గ్లెన్ ఫిలిప్స్ ఓ వికెట్ పడగొట్టాడు.
అంతకముందు ఓవర్ నైట్ స్కోరు 198/5 తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన న్యూజిలాండ్ మరో 57 పరుగులు జోడించి మిగిలిన ఐదు వికెట్లు కోల్పోయింది. మొత్తంగా రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగులు చేసింది. కెప్టెన్ టామ్ లాథమ్ (86; 133 బంతుల్లో 10 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లు, రవీంద్ర జడేజా మూడు, రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు తీశారు.
ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులు చేసింది. ఆ తరువాత భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకు ఆలౌటైంది. దీంతో కివీస్ 103 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించిన సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ 255 పరుగులు చేయగా భారత్ ముందు 359 పరుగుల లక్ష్యం నిలవగా 245 పరుగులకు కుప్పకూలింది.
IND vs NZ : స్వదేశంలో భారత్ ఎన్ని సార్లు 300 ఫ్లస్ లక్ష్యాన్ని ఛేదించిందో తెలుసా ?