IND vs AFG : ఊహించని షాకిచ్చిన అఫ్గానిస్థాన్.. సందిగ్ధంలో టీ20 సిరీస్!
సెప్టెంబర్ 13 నుంచి భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య (IND vs AFG) మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది
IND vs AFG T20I series media rights given to Pakistan company
IND vs AFG : సెప్టెంబర్ 13 నుంచి భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానం ఈ మూడు మ్యాచ్‌లకు వేదిక కానుంది. ఈ సిరీస్ భారత్ వేదికగానే జరుగుతున్నప్పటికి అఫ్గానిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఆ దేశంలోని పరిస్థితుల కారణంగా సొంతంగా ద్వైపాక్షిక సిరీస్‌లను నిర్వహించే అవకాశం అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డుకు లేదు. ఈ క్రమంలో తాము ఆతిథ్యం ఇచ్చే మ్యాచ్‌లను యూఏఈ లేదా భారత్ వేదికగా ఆతిథ్యం ఇస్తూ వస్తోంది. అయితే.. తాజాగా భారత్ వేదికగా జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నిర్వహణ ఇప్పుడు సందిగ్ధంలో పడింది. ఇందుకు అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ)తీసుకున్న ఓ నిర్ణయమే కారణం.
భారత్, అఫ్గానిస్థాన్ మధ్య జరగనున్న టీ20 సిరీస్‌కు సంబంధించిన వాణిజ్య, టీవీ ప్రొడక్షన్ హక్కులను పాకిస్థాన్‌కు చెందిన ట్రాన్స్‌గ్రూప్ దక్కించుకుంది. ఈ సంస్థ పాకిస్థాన్ సూపర్ లీగ్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతోనూ భాగస్వామ్యంగా ఉంది. ‘ఏసీబీతో సుదీర్ఘ కాలంగా సంబంధాలు కలిగిన ట్రాన్స్ గ్రూప్.. అఫ్గాన్ అంతర్జాతీయ మీడియా హక్కుల భాగస్వామిగా ఉంటుంది. టీపీటీ 360 మీడియా ప్రొడక్షన్ పార్ట్నర్, భారత్‌లో ఫ్యాన్ కోడ్ అధికారికంగా టీ20 సిరీస్‌ను ప్రసారం చేస్తాయి.’ అని అఫ్గాన్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.
దీంతో భారత్, అఫ్గాన్ టీ20 సిరీస్‌పై సందిగ్ధం నెలకొన్నట్లుగా తెలుస్తోంది. ఈ సిరీస్ ప్రసార హక్కులను పాక్ కు చెందిన సంస్థ సొంతం చేసుకోవడంతో.. ఈ సిరీస్ నిర్వహణపై పునరాలోచన చేసే దిశగా అడుగులు పడే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది
షెడ్యూల్ ఇదే..
* తొలి టీ20 మ్యాచ్ – సెప్టెంబర్ 13న
* రెండో మ్యాచ్ – సెప్టెంబర్ 15న
* మూడో టీ20 సెప్టెంబర్ 17న
