మరుగుజ్జు అని హేళన చేశారు.. ఇప్పుడు దేశానికి స్వర్ణం తెచ్చాడు

నవదీప్ తొలుత రెజ్లర్ కావాలని అనుకున్నాడట. కానీ, చిన్నతనంలోనే వెన్ను గాయం కారణంగా రెజ్లింగ్ కలను దూరం చేసుకున్నాడు.

మరుగుజ్జు అని హేళన చేశారు.. ఇప్పుడు దేశానికి స్వర్ణం తెచ్చాడు

navdeep

Javelin Throw Navdeep : అతను కేవలం నాలుగు అడుగుల నాలుగు అంగుళాల పొడవు ఉంటాడు. తోటి స్నేహితులు, చుట్టుపక్కల వారంతా మరగుజ్జు అంటూ హేళన చేశారు. నిత్యం అవమానాలతో ఒకానొక సందర్భంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు భయపడ్డాడు. కానీ, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో తన లక్ష్యంవైపు అడుగులు వేశాడు. ఆ సమయంలోనూ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. అయినా.. పట్టుదలతో ముందుకెళ్లి తనను హేళన చేసిన వారందరికీ రోల్ మోడల్ గా నిలిచే స్థాయికి చేరాడు. నిత్యం తన ప్రతిభకు పదును పెడుతూ నేడు భారత దేశానికి స్వర్ణ పతకాన్ని తీసుకొచ్చాడు. అతనే జావెలిన్ త్రోయర్ నవదీప్.

Also Read : Paralympics 2024 : ప్రతిభకుతోడు అదృష్టం కలిసొచ్చింది.. జావెలిన్‌లో సత్తాచాటిన నవదీప్.. పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం

నవదీప్ హర్యానాలోని పానిపట్ జిల్లా బువానా లుఖు గ్రామంలో 2000 సంవత్సరంలో జన్మించాడు. ఏడో నెలలోనే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాడు. చిన్నతనం నుంచి అతను మరుగుజ్జుతో బాధపడుతున్నాడు. నవదీప్ మరుగుజ్జు అని గుర్తించడానికి తల్లిదండ్రులకు రెండేళ్లు పట్టింది. తండ్రి పంచాయితీ సమితి అధికారి. తల్లి రోహ్‌తక్. అయితే, నవదీప్ ఢిల్లీలో చికిత్స పొందాడు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మొదటిసారి అథ్లెటిక్స్ పోటీలో పాల్గొనడం ప్రారంభించాడు. జాతీయ స్థాయి పాఠశాల పోటీలలో వరుస పతకాలు సాధించాడు. అతనికి 2012లో రాష్ట్రీయ బాల పురస్కారం అవార్డుకూడా లభించింది. అయితే, నవదీన్ మరుగుజ్జు కావడంతో చిన్నతనం నుంచి తోటివారు ఆటపట్టించేవారని, ఈ సమయంలో చాలా రోజులు నవదీప్ ఇంటి నుంచి బయటకు రాలేదని అతని అన్నయ్య మన్‌దీప్ షెరాన్ తెలిపాడు. ఆ సమయంలో తన తండ్రి దల్వీర్ సింగ్ నవదీప్ కు పుస్తకాలు తెచ్చి ఇచ్చేవారని, అతనితో నిత్యం మాట్లాడుతూ ప్రోత్సహించారని మన్‌దీప్ షెరాన్ పేర్కొన్నాడు. మా నాన్న చనిపోయి రెండు నెలలు అవుతుంది.. ఆయన ఉండిఉంటే నవదీప్ సాధించిన ఘనతను చూసి ఎంతో గర్వపడేవాడని మన్‌దీప్ షెరాన్ అన్నారు.

నవదీప్ తొలుత రెజ్లర్ కావాలని అనుకున్నాడట. కానీ, చిన్నతనంలోనే వెన్ను గాయం కారణంగా రెజ్లింగ్ కలను దూరం చేసుకున్నాడు. నవదీప్ రాష్ట్రపతి అవార్డుకు ఎంపికైనప్పుడు గ్రామం మొత్తం పెద్దెత్తున సంబురాలు చేసుకుంది. నవదీప్ ఢిల్లీలో శిక్షణ తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు అతని తండ్రి తన ఎల్ఐసీ పాలసీ నుంచి రుణం తీసుకొని ఇచ్చాడని నవదీన్ సోదరుడు మన్‌దీప్ షెరాన్ తెలిపాడు.

Also Read : Yograj Singh : అర్జున్ టెండూల్కర్ కెరీర్‌పై యువీ తండ్రి యోగరాజ్ సింగ్ కామెంట్స్‌.. బొగ్గు గ‌నిలో..

పారాలింపిక్స్‌ 2024 జావెలిన్ త్రో ఎఫ్-41 విభాగంలో నవదీప్ సింగ్ 47.32 మీటర్ల దూరం జావెలిన్ విసిరాడు. తొలుత నవదీప్ కు రజతం దక్కింది. ఇదే విభాగంలో ఇరాన్ కు చెందిన అథ్లెట్ సదేగ్ బీత్ సయా 47.64 మీటర్ల దూరం జావెలిన్ విసిరి మొదటి స్థానంలో నిలిచాడు. అయితే, అతనిపై అనూహ్యంగా వేటు పడటంతో.. ఆ తరువాత స్థానంలో రన్నరప్ గా నిలిచిన నవదీప్ సింగ్ ను అదృష్టం వరించింది. రజత పతకం కాస్తా స్వర్ణంగా మారింది. దీంతో జావెలిన్ త్రో ఎఫ్-41లో స్వర్ణం సాధించిన ఏకైక భారత అథ్లెట్ గా నవదీప్ అరుదైన ఘనత సాధించాడు. ప్రతిభకుతోడు అదృష్టం కలిసిరావడంతో పారాలింపిక్స్ 2024లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది.