వెస్టిండీస్‌తో తొలి వన్డేలో దాదాపు గెలుస్తుందనుకున్న భారత్ చేజాతులారా పరాజయాన్ని మూటగట్టుకుంది. మ్యాచ్ విశ్లేషణలో ఈ మూడు కారణాలే జట్టును ఓడేలా చేశాయని అభిప్రాయపడుతున్నారు. సూపర్ ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ తడబడటమే కారణమా.. కరేబియన్ వీరుల ముందు భారత బౌలర్లు రాణించలేకపోయారా..?
ఆరంభంలోనే తడబాటు:
టాస్ ఓడిపోయిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ తీసుకోవడం ఓ సమస్య. మైదానం క్రమంగా నెమ్మెదిగా మారుతుందని భావించాడు. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు తక్కువ పరుగులకే వెనుదిరగడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అయినప్పటికీ రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్‌లు వంద పరుగుల భాగస్వామ్యంతో నెమ్మెదిగా ఆడటంతో పరవాలేదనిపించే స్కోరు చేయగలిగారు.
మిడిల్ ఓవర్లలో తడబాటు:
తుది జట్టులో యుజ్వేంద్ర చాహల్‌ను తీసుకోకుండా కోహ్లీ.. శివం దూబె, కేదర్ జాదవ్‌లను ఐదో బౌలింగ్ ఆప్షన్‌గా తీసుకున్నాడు. దీంతో షిమ్రోన్ హెట్‌మేయర్, షై హోప్‌లను ఎదుర్కోవడం కష్టంగా మారింది. లక్ష్య చేధనలో వారి భాగస్వామ్యాన్ని బ్రేక్ చేయడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది. మిడిల్ ఓవర్లలో బాగా పరుగులు దండుకున్నారు కరేబియన్ వీరులు.
‘చీకటి పడిన తర్వాత లైట్ల వెలుగులో మైదానం బాగా పనిచేసింది. వాళ్లు బ్యాటింగ్ బాగా చేశారు. ఫాస్ట్ బౌలర్లకు బంతి అనుకూలించలేదనుకుంటున్నా. హెట్‌మేయర్, షై హోప్‌ల ప్రదర్శన అద్భుతంగా ఉంది’ అని విరాట్ కోహ్లీ మ్యాచ్ అనంతరం అన్నాడు.
అనుభవ లోపం:
రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్‌లు హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న తర్వాత సెటిల్ అయినట్లు కనిపించారు. వీరి దూకుడు చూసి భారత్ 300పరుగులకు చేరుకుంటుందనే వాతావరణం కనిపించింది. కాస్త విరామంలోనే షాట్ లకు యత్నించి వెనుదిరిగారు. శ్రేయాస్(70), రిషబ్ (71)పరుగులు మాత్రమే చేయగలిగారు. వెస్టిండీస్ స్మార్ట్‌గా ఆలోచించి చివరి 10ఓవర్లలో వికెట్లు పడగొట్టింది.