IND-W vs AUS-W : చరిత్ర సృష్టించిన భారత అమ్మాయిలు.. ఏకైక టెస్టు మ్యాచులో ఆస్ట్రేలియా పై ఘన విజయం
భారత మహిళల జట్టు చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. మొన్న ఇంగ్లాండ్‌ను మట్టికరిపించిన భారత్ నేడు ఆస్ట్రేలియా పై చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది.

India women seal historic Test win over Australia
India Women vs Australia Women Test : భారత మహిళల జట్టు చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. మొన్న ఇంగ్లాండ్‌ను మట్టికరిపించిన భారత్ నేడు ఆస్ట్రేలియా పై చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ముంబైలోని వాంఖడే మైదానంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచులో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియాతో 11 టెస్టు మ్యాచులు ఆడగా భారత జట్టుకు ఇదే మొదటి విజయం కావడం గమనార్హం. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును స్నేహ్ రాణా దక్కించుకుంది.
75 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ షపాలీ వర్మ (4), రిచా ఘోష్ (13) లు తొందరగానే ఔటైనప్పటికీ మరో ఓపెనర్ స్మృతి మంధాన (38), జెమీమా రోడిగ్స్ (12) ఆఖరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కిమ్ గార్త్, గార్డెన్ లు చెరో వికెట్ తీశారు. అంతక ముందు ఓవర్‌నైట్ స్కోరు 233/5 స్కోరుతో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆస్ట్రేలియా మరో 28 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన ఐదు వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో స్నేహ్ రాణా నాలుగు వికెట్లు తీసింది. రాజేశ్వరీ గైక్వాడ్ రెండు వికెట్లు తీయగా పూజా వస్త్రాకర్ ఓ వికెట్ పడగొట్టింది.
స్కోర్లు ఇవే..
ఆస్ట్రేలియా.. మొదటి ఇన్నింగ్స్ 219, రెండో ఇన్నింగ్స్ 261
భారత్.. మొదటి ఇన్నింగ్స్ 406, రెండో ఇన్నింగ్స్ 75/2.
సానుకూల థృక్పథంతో ఆడాం..
సానుకూల థృక్పథంతో క్రికెట్‌ను ఆడడం వల్లే ఆస్ట్రేలియాపై విజయం సాధించి చరిత్ర సృష్టించగలిగామని కెప్టెన్ హర్మన్ ప్రీత్ అంది. జట్టులోని ప్రతీ ప్లేయర్ చాలా శ్రమించారని, దీని వల్లే ఇలాంటి విజయం దక్కిందన్నారు. మంచి భాగస్వామ్యాలు నిర్మించి భారీ స్కోరు చేయాలని భావించామని, తాము అనుకున్న విధంగానే ప్లాన్‌ను అమలు చేసినట్లు చెప్పుకొచ్చారు. టెస్టు మ్యాచ్ ఆడాలనేది ప్రతి ఒక్కరి కల అని దానిని నెరవేర్చినందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి ధన్యవాదాలు తెలియజేశారు.
Captain @ImHarmanpreet reflects on a momentous victory and has a special message for #TeamIndia fans ?#INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/8xcRl9pytE
— BCCI Women (@BCCIWomen) December 24, 2023